Chariot: అక్రమాలు తవ్వుతుంటే.. బయటపడిన 2 వేల ఏళ్ల నాటి రథం!

  • ఇటలీలోని పాంపీలో గుర్తించిన పురాతత్వ శాస్త్రవేత్తలు
  • ఇప్పటిదాకా కనిపెట్టిన వాటిలో దీనికి మించింది లేదని వ్యాఖ్య
  • కొత్త పెళ్లికూతురును మెట్టినింటికి పంపించేందుకు రథాన్ని వాడి ఉంటారంటున్న శాస్త్రవేత్తలు
Exceptional discovery Archeologists find 2000 year old chariot intact near Pompeii

ఒకటా రెండా.. 2 వేల ఏళ్ల నాటి అతి పురాతన రథం అది. అయినా ఈనాటికీ అది ఇసుమంత కూడా చెక్కు చెదరలేదు. దాని ఆనవాళ్లు కోల్పోలేదు. ఓ కేసును దర్యాప్తు చేస్తుండగా ఈ రథం బయటపడింది. ఇటలీలోని ప్రముఖ పురాతత్వ ప్రాంతమైన పాంపీలో ఇది వెలుగు చూసింది.

నేపుల్స్ లోని ఓ పార్కు వద్ద అక్రమ తవ్వకాల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఓ పెద్ద సొరంగం కనిపించడం..  ఆ విషయాన్ని పురాతత్వ నిపుణులకు చెప్పడం.. వారొచ్చి అక్కడ తవ్వకాలు జరపడం జరిగిపోయాయి. ఆ తవ్వకాల్లోనే రథం, దానికి అమర్చిన ఇనుము, కాంస్య లోహాల అలంకరణలు, రథంలోని చెక్క భాగాలను గుర్తించారు.

ఇప్పటిదాకా దొరికిన పురాతత్వ వస్తువుల్లో ఈ రథానికి మించినది ఏదీ లేదని పురాతత్వ అధికారులు చెబుతున్నారు. అన్నేళ్ల నుంచి ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా అది భద్రంగా ఉందన్నారు. ఇప్పటిదాకా కనుగొన్న వాటిలో ఇదో అద్భుతమన్నారు.

క్రీస్తు శకం 79వ సంవత్సరంలో మౌంట్ వెసువియస్ అగ్నిపర్వతం బద్దలవడం వల్ల పాంపీ నగరం మొత్తం నాశనమైందని, అయితే, ఓ పెద్ద భవనం కూలడం వల్ల రథం చాలా భద్రంగా ఉందని, ఇన్నాళ్లూ చెక్కు చెదరకుండా ఉందని చెప్పారు. కొందరు ఈ ప్రాంతంలో సొరంగాలు తవ్వి దొంగతనాలకు ప్రయత్నించినా కుదరలేదని చెపారు. కాగా, రథానికి చెందిన ఓ ఇనుప ధాతువు జనవరి 7న బయటపడింది. 80 మీటర్ల మేర సొరంగాలు తవ్వినందుకుగానూ అక్కడే ఓ ఇంట్లో ఉంటున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ దర్యాప్తు సాగుతోంది.

కాగా, ఈ రథాన్ని పెళ్లిళ్లు, వేడుకల్లో ఊరేగింపుల కోసం ఎక్కువగా వాడి ఉంటారని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వధువులను తన అత్తగారింటికి ఈ రథంలోనే పంపించి ఉంటారని భావిస్తున్నారు.

More Telugu News