మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చుతాం: య‌న‌మ‌ల

28-02-2021 Sun 12:33
  • వైసీపీ 20 నెలల పాలనను గుర్తు చేసుకోవాలి
  • టీడీపీ పాల‌న‌తో పోల్చుకుని చూడండి
  • వైసీపీ పాలనలో చాలా వర్గాలు జీవనోపాధిని కోల్పోయాయి
yanamala fires on ycp

వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ 20 నెలల పాలనను గుర్తు చేసుకుని, టీడీపీ పాల‌న‌తో పోల్చుకుని  మునిసిపల్‌ ఎన్నికల్లో ఓట్లు వేయాలని చెప్పారు.

ఏ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలు పరిశీలించాలని ఆయ‌న తెలిపారు. సుపరిపాలనను అందించేది ఎవరనే విష‌యాన్ని ఆలోచించాల‌ని చెప్పారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను త‌మ పార్టీ నెరవేర్చుతుంద‌ని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో చాలా వర్గాలు జీవనోపాధిని కోల్పోయాయ‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నియంత్ర‌ణ‌లో లేకుండా పోయాయ‌ని చెప్పారు.  

వైసీపీ పాల‌న‌లో ఆ పార్టీ నేతల ఆస్తులే పెరిగాయ‌ని, ప్రజల ఆస్తులు పెరగలేదని వ్యాఖ్యానించారు. వారికి ఏ ప్ర‌యోజ‌నాలూ అంద‌ట్లేద‌ని అన్నారు. రాష్ట్రంలో గ‌త‌ రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేటాయింపులకు తగ్గ ఖర్చులు లేవని ఆయ‌న విమ‌ర్శించారు. అందుకే, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓట్లు వేసే ముందు బాగా ఆలోచించుకోవాల‌ని ఆయ‌న సూచించారు.