మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే టీడీపీ అభ్యర్థులను ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారు: నారా లోకేశ్

28-02-2021 Sun 11:45
  • ఏపీలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు
  • సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు
  • టీడీపీ నేతలను బెదిరిస్తున్నారని ఆరోపణ
  • ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పుతున్నారని వెల్లడి
Nara Lokesh slams CM Jagan ahead of Municipal Polls

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారని భావించిన టీడీపీ అభ్యర్థులను ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారని సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వైసీపీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు లేక టీడీపీ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి బులుగు కండువాలు కప్పారని ఆరోపించారు.

పలాస, రాయదుర్గంతో పాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కులేని పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి పార్టీకి అధినేత అయిన సీఎంజగన్ తాడేపల్లి నివాసం నుంచి బయటికి వస్తే జనం తంతారని భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీ అభ్యర్థులకు జనాల్లోకి వెళ్లి ఓట్లు అడగాలంటే భయం అని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు... నువ్వొక నాయకుడివి, నీదొక పార్టీ... అందుకే నిన్ను పిరికివాడు అనేది అంటూ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.