ప్రపంచం మారిపోయినా, నా మాజీ ప్రియుడు ఎదగలేదు: కంగనా రనౌత్!

28-02-2021 Sun 09:01
  • 2016లో  ఇద్దరి మధ్యా విభేదాలు
  • ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణకు హాజరైన హృతిక్
  • ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించిన కంగన
Kangana Latest Comments on Ex Lover Hruthik Roshan

తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ గురించి ట్విట్టర్ లో స్పందించిన హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచం చాలా మారిపోయిందని, తన మాజీ లవర్ మాత్రం ఇంకా మారకుండా అక్కడే ఉండిపోయాడని వ్యాఖ్యానించింది. ఎదిగేందుకు అవస్థలు పడుతూ ఉన్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా, వీరిద్దరి మధ్యా 2016 నుంచి నకిలీ ఈ-మెయిల్ వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కేసులో హృతిక్ రోషన్ ను తమ కార్యాలయానికి పిలిపించిన ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం, శనివారం నాడు అతని వాంగ్మూలాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం డిసెంబర్ లో పెండింగ్ లోని నకిలీ ఈమెయిల్స్ ను దర్యాఫ్తు చేయాలని హృతిక్ తరపు న్యాయవాది ముంబై పోలీసు కమిషనర్ ను కలసి విన్నవించగా, ఆపై ఈ కేసు విచారణను క్రైమ్ బ్రాంచ్ కి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

హృతిక్, కంగనాల మధ్య ఐదేళ్ల క్రితం వరకూ నడిచిన ప్రేమ వ్యవహారం, 2016లో కోర్టుకు ఎక్కింది. కంగన చేసిన ఆరోపణలన్నింటినీ గతంలోనే హృతిక్ తోసిపుచ్చాడు. తన పేరిట ఎవరో నకిలీ ఖాతాను సృష్టించి, కంగనకు ఈ-మెయిల్స్ పంపారన్నది హృతిక్ వాదన. వీటితో తనకేమీ సంబంధం లేదని హృతిక్ చెబుతుండగా, మొత్తం వాస్తవాలు విచారణలో బయటకు వస్తాయని కంగన నమ్మకంగా అంటోంది.