తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరికి కేటీఆర్ అండ!

28-02-2021 Sun 06:35
  • 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ కొల్లూరి కీలక పాత్ర
  • గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై కొల్లూరి
  • తక్షణ సాయంగా సీఎం సహాయ నిధి నుంచి రూ. 10 లక్షల అందజేత
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఈటల
Minister KTR Supports Telangana Activist Doctor Kolluri

వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఆయన ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్న విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. కొల్లూరి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తక్షణం రూ.10 లక్షలు అందించే ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ స్పందించిన తీరుకు డాక్టర్ కొల్లూరి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

1969 నాటి తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ కొల్లూరి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మరో మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ పాల్గొన్న కొల్లూరి త్వరగా కోలుకోవాలని ఈటల ఆకాంక్షించారు.