మొతేరాలో జరిగే చివరి టెస్టుకు బ్యాటింగ్ పిచ్!

27-02-2021 Sat 21:36
  • నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 2-1తో ముందంజ
  • మొతేరా టెస్టు రెండ్రోజుల్లో ముగిసిన వైనం
  • పిచ్ పై తీవ్ర విమర్శలు
  • ఐసీసీ చర్యలు తీసుకుంటుందని ప్రచారం
  • చివరి టెస్టు తర్వాతే ఐసీసీ నిర్ణయం!
Batting pitch for last test between India and England at Motera

అహ్మదాబాద్ లోని మొతేరాలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ముగిసిన మూడో టెస్టులో వికెట్ల జాతర జరిగిన సంగతి తెలిసిందే. స్పిన్నర్లు పండగ చేసుకున్న ఈ మ్యాచ్ కేవలం రెండ్రోజుల్లోనే ముగియడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఓ దశలో మొతేరా మైదానంపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందన్న ప్రచారం కూడా జరిగింది.

అయితే ఈ సిరీస్ లో చివరిదైన నాలుగో టెస్టుకు కూడా మొతేరానే ఆతిథ్యం ఇస్తుండడంతో ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. చివరి టెస్టు ముగిసిన తర్వాత మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఐసీసీ నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. పైగా చివరి టెస్టుకు బ్యాటింగ్ పిచ్ సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. బంతి బౌన్స్ అయి బ్యాట్ పైకి వచ్చేలా పిచ్ ఉపరితలం గట్టిగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారని భారత క్రికెట్ వర్గాలంటున్నాయి.

అదే జరిగితే ఒకే స్టేడియం భిన్నమైన పిచ్ లు కలిగి ఉండొచ్చన్న అంశం తెరపైకి రావడమే కాకుండా... ఒక చెడ్డ పిచ్, ఒక మంచి పిచ్ ఉన్న స్టేడియంపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశాల్లేవని భావిస్తున్నారు. కాగా చివరి టెస్టును భారత్ డ్రా చేసుకున్నా చాలు... సిరీస్ 2-1తో వశమవుతుంది. ఇప్పటికే 2-1తో నాలుగు టెస్టుల సిరీస్ లో ఆధిక్యంతో ఉన్న భారత్ ఈ సిరీస్ ను కోల్పోయే అవకాశం లేదు. ఒకవేళ చివరి టెస్టును ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మార్చి 4 నుంచి 8వ తేదీ వరకు జరగనుంది.