స్టేజిపై వైయస్ షర్మిల డ్రామాను రక్తి కట్టించారు: రేవంత్ రెడ్డి

27-02-2021 Sat 21:02
  • విద్యార్థులతో భేటీ సందర్భంగా షర్మిలతో మాట్లాడిన విద్యార్థి
  • నేను మిమ్మల్ని నిలబెడతానమ్మా అని చెప్పిన షర్మిల
  • ఆ యువకుడు విద్యార్థే కాదని చెప్పిన రేవంత్ రెడ్డి
YS Sharmila played drama well says Revanth Reddy

కొత్త పార్టీ పెడుతున్న క్రమంలో వైయస్ షర్మిల వరుసగా సమావేశాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యూనివర్శిటీ విద్యార్థులతో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ఆమెతో మాట్లాడుతూ... 'నాకు తండ్రి లేడు, వైయస్ చనిపోయినప్పుడు నాన్న గుండె నొప్పితో చనిపోయాడు. నాకిప్పుడు తండ్రయినా, అక్కయినా మీరే. మీరు వెనకడుగు వేయొద్దు. మీరుంటే చాలక్కా... నేనున్నానని చెప్పక్కా' అని అడిగాడు. దీనికి స్పందనగా... ఉన్నానమ్మా, నేను నిలబెడతా, మిమ్మల్ని నిలబెడతా అని షర్మిల అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు ఈ వీడియో గురించి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలతో మాట్లాడిన యువకుడి పేరు సునంద్ జోసెఫ్ అని చెప్పారు. ఆ యువకుడు విద్యార్థి కాదు, నిరుద్యోగి కాదని అన్నారు. కల్వరి టెంపుల్ లో అర్కెస్ట్రా వాయిద్యాన్ని వాయిస్తుంటాడని చెప్పారు. జోసెఫ్ తండ్రి  వైయస్ చనిపోవడానికి ముందే చాలా ఏళ్ల క్రితమే మరణించాడని తెలిపారు.

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ డ్రామా ఆడారని విమర్శించారు. స్టేజి మీద డ్రామాను రక్తికట్టించారని... ఈ డ్రామాకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువేనని అన్నారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ డ్రామాకు తెర లేపారని చెప్పారు. షర్మిలతో కనిపించిన యువకుడి ఫేస్ బుక్ ప్రొఫైల్ లో హరీశ్ రావుతో దిగిన ఫొటోలను చూడొచ్చని అన్నారు.