కుమార్తెను తల్లిదండ్రులే విక్రయించిన ఘటనపై చంద్రబాబు స్పందన

27-02-2021 Sat 20:56
  • నెల్లూరు జిల్లాలో ఘటన
  • ఓ కుమార్తెకు వైద్యం చేయించేందుకు మరో కుమార్తె అమ్మకం
  • 12 ఏళ్ల బాలికను కొనుక్కుని పెళ్లి చేసుకున్న వ్యక్తి
  • తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు
Chandrababu responds after parents sold their daughter for treatment of another daughter

నెల్లూరులో కూలీనాలీ చేసుకునే దంపతులు ఒక కుమార్తెకు చికిత్స చేయించేందుకు డబ్బుల్లేక మరో కుమార్తెను రూ.12 వేలకు విక్రయించిన ఘటన అందరినీ కలచివేసింది. ఆ బాలికను కొనుగోలు చేసిన 46 ఏళ్ల వ్యక్తి ఆమెను పెళ్లాడాడు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటన అత్యంత బాధాకరమే కాకుండా, ఏపీలో ఆరోగ్య భద్రత దిగజారిపోతోందన్నదానికి నిదర్శనమని పేర్కొన్నారు. దిగ్భ్రాంతి కలిగించే ఈ ఘటన ప్రభుత్వానికి మేల్కొలుపు అని స్పష్టం చేశారు. పేదవాళ్లకు లబ్ది చేకూర్చని ఈ సంక్షేమ పథకాలు ఎవరి కోసం? అని మండిపడ్డారు. ప్రభుత్వం గొప్పలకు పోకుండా, ఏపీలో సంక్షేమ పథకాలకు మరింత ఊతమివ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తెరగాలని చంద్రబాబు హితవు పలికారు.