తీర్పులను తప్పుబట్టొచ్చు కానీ, న్యాయమూర్తులను దూషించడం సరికాదు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

27-02-2021 Sat 20:27
  • పాట్నాలో హైకోర్టు నూతన భవనాలు ప్రారంభం
  • ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి
  • అనుకూల తీర్పులు రాకపోతే జడ్జిలను తిడుతున్నారు 
  • సోషల్ మీడియాలో ఈ ధోరణి ఎక్కువైందని వివరణ
Union Minister Ravishankar Prasad inaugurates Patna high court new buildings

బీహార్ రాజధాని పాట్నాలో హైకోర్టు కొత్త భవనాలను కేద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల జడ్జిలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్న ఘటనలు ఎక్కువయ్యాయని అన్నారు.

తాము కోరుకున్న విధంగా తీర్పు రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్న వ్యక్తులు న్యాయమూర్తులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో ఈ తరహా ధోరణులు అధికంగా కనిపిస్తున్నాయని అన్నారు. తీర్పును తప్పుబట్టొచ్చు కానీ, న్యాయమూర్తులను దూషించడం సరికాదని హితవు పలికారు.

దేశవ్యాప్తంగా ఏ స్థాయికి చెందిన కోర్టు అయినా న్యాయశాస్త్రం ప్రకారం తీర్పు వెలువరించే స్వేచ్ఛ జడ్జిలకు ఉండాలని రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా దూషణలకు గురయ్యే వారికి ఓ పరిష్కార వేదిక ఉండాలని పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, సుప్రీంకోర్టు సీజేఐ ఎస్ఏ బోబ్డే కూడా హాజరయ్యారు.