తాను ఐఫోన్ ను ఎక్కువగా ఉపయోగించకపోవడానికి కారణం చెప్పిన బిల్ గేట్స్

27-02-2021 Sat 20:05
  • ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఐఫోన్ యూజర్లు
  • తాను ఐఫోన్ ను చాలా తక్కువగా ఉపయోగిస్తానన్న గేట్స్
  • రోజువారీ అవసరాలకు ఆండ్రాయిడ్ ఫోన్లనే వాడతానని వెల్లడి
  • వాటిలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్లు ఉంటాయని వివరణ
Bill Gates tells why he does not prefer to use iPhone regularly

స్మార్ట్ ఫోన్ రంగంలో ఐఫోన్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. భద్రత, ఫీచర్ల పరంగా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పిన ఐఫోన్ ను ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది వినియోగిస్తున్నారు. అయితే, ప్రముఖ ఐటీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాత్రం ఐఫోన్ ను పెద్దగా ఉపయోగించరంటే ఆశ్చర్యపోవాల్సిందే. అందుకు కారణమేంటో ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తాను సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్ నే ఎక్కువగా వాడుతుంటానని, ప్రతి అంశాన్ని అనుసరించేందుకు అదే అనుకూలమైన ఫోన్ అని భావిస్తుంటానని తెలిపారు. అయితే ఐఫోన్ ను అప్పుడప్పుడు వినియోగిస్తుంటానని పేర్కొన్నారు. రోజువారీ అవసరాలకు మాత్రం తాను ఆండ్రాయిడ్ ఫోన్ పైనే ఆధారపడుతుంటానని గేట్స్ స్పష్టం చేశారు.

"చాలా కంపెనీలు ఆండ్రాయిడ్ ఫోన్లలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్ లను ముందే ఇన్ స్టాల్ చేసి వినియోగదారులకు అందిస్తుంటాయి. అందుకే నాకు ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగించడం చాలా తేలిక అనిపిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్లలో ఉపయోగించే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను మనకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకోవడం కొంచెం కష్టమైన పని. ఆండ్రాయిడ్ ఓఎస్ ఇతర సాఫ్ట్ వేర్ లతో ఎంతో సులువుగా అనుసంధానం అవుతుంది" అని వివరించారు.