ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాస్క్ ధరించను: రాజ్ థాకరే

27-02-2021 Sat 19:42
  • మాస్క్ ధరించకుండానే కార్యక్రమానికి హాజరైన రాజ్ థాకరే
  • కేసులు పెరుగుతుంటే ఎన్నికలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్న
  • ఎన్నికలను ఎందుకు వాయిదా వేయడం లేదు?
I dont wear mask at all says Raj Thackeray

మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ముంబైలో ఇప్పటికే కరోనా కేసులు నమోదైన వందలాది అపార్ట్ మెంట్లకు సీల్ వేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే పిలుపునిచ్చారు. ఇంత జరుగుతున్నా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే మాత్రం నా రూటే సెపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

తాను ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ ధరించనని రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని శివాజీ పార్కులో జరిగిన మరాఠీ భాషా దినోత్సవం కార్యక్రమానికి రాజ్ థాకరే హాజరయ్యారు. మాస్కు ధరించకుండానే ఆయన వచ్చారు. ఈ విషయమై మీడియా ఆయనను ప్రశ్నించగా... తాను మాస్క్ ధరించనని చెప్పారు.

నిజంగా కరోనా కేసులు పెరుగుతున్నట్టయితే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేసులు పెరుగుతున్నట్టయితే ఎన్నికలను ఎందుకు వాయిదా వేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్ థాకరే భార్య, కుమారుడు, కోడలు కూడా హాజరయ్యారు. అయితే, వీరందరూ మాస్క్ ధరించడం గమనార్హం.