హైదరాబాదులోనూ '100 ఆక్టేన్ ప్రీమియం' పెట్రోల్.. లీటరు రూ.160

27-02-2021 Sat 19:02
  • ఇప్పటికే పలు నగరాల్లో విక్రయాలు
  • హైదరాబాదులోనూ అమ్మకాలు షురూ చేసిన ఐఓసీ
  • వాహనాల ఇంజిన్ సామర్థ్యం మరింత పెరుగుతుందన్న డీలర్లు
  • బీఎస్-6 వాహనాలకు ఈ పెట్రోల్ తగినదని నిపుణుల అభిప్రాయం
IOC launched premium petrol sales in Hyderabad

ప్రస్తుతం మార్కెట్లో లభించే పెట్రోల్ కంటే అత్యున్నత నాణ్యత కలిగివుండే 100 ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ హైదరాబాదులోనూ లభ్యమవుతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఇటీవలే హైదరాబాదులో ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ అమ్మకాలు షురూ చేసింది. ఈ 100 ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.160 ధర పలుకుతోంది. ఈ వరల్డ్ క్లాస్ పెట్రోల్ వాహనాల మన్నికను మరింత పెంచుతుందని, ఇంజిన్ జీవితకాలాన్ని పొడిగిస్తుందని ఐఓసీ డీలర్ల కన్సార్టియం సంయుక్త కార్యదర్శి రాజీవ్ అమరం తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ ప్రీమియం స్థాయి పెట్రోల్ ను గతేడాది నుంచి ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఆగ్రా, ముంబయి, అహ్మదాబాద్, చండీగఢ్, జైపూర్, లుధియానా నగరాల్లో విక్రయిస్తున్నారు. కాగా, ఈ నాణ్యమైన పెట్రోల్ మధురలోని ఐఓసీ రిఫైనరీ నుంచి సరఫరా చేస్తున్నారు. బీఎస్-6 వాహనాలకు ఈ పెట్రోల్ సరైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.