ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేసే కరోనా వ్యాక్సిన్ ఖర్చు మేమే భరిస్తాం: కేంద్రం

27-02-2021 Sat 18:42
  • దేశంలో పూర్తయిన తొలి విడత కరోనా వ్యాక్సినేషన్
  • మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్
  • రెండో విడతలో 60 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే వ్యాక్సిన్
  • ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలకు ధర చెల్లించాలని వెల్లడి
Second phase corona vaccination from March first

దేశంలో ఇప్పటివరకు ఆరోగ్య, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులు, భద్రతా బలగాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన సంగతి తెలిసిందే. తాజాగా మార్చి 1 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ చేపడుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. రెండో విడతలో 60 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపింది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే టీకాలు వేస్తారని, ఆ వ్యాక్సిన్ ఖర్చును తామే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, వ్యాక్సిన్ అందిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ప్రైవేటు ఆసుపత్రుల్లో అందించే వ్యాక్సిన్ ధరను ప్రజలే చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ధర సర్వీసు రుసుంతో కలిపి రూ.250 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.