బుల్లెట్ వేరియంట్ల ధరలను పెంచిన రాయల్ ఎన్ ఫీల్డ్

27-02-2021 Sat 18:30
  • గతేడాది బీఎస్6 మోడళ్లను తీసుకువచ్చిన రాయల్ ఎన్ ఫీల్డ్
  • తాజాగా బుల్లెట్ శ్రేణి బైకులపై రూ.3,447 వరకు పెంపు
  • బుల్లెట్ స్టాండర్డ్, ఈఎస్, షేడ్స్ వెర్షన్ల ధరల్లో పెరుగుదల
  • 1.46 లక్షల ధర పలుకుతున్న బుల్లెట్ ఈఎస్ మోడల్
Royal Enfield hikes prices of Bullet variants

రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ తయారుచేసే మోటార్ సైకిళ్లలో బుల్లెట్ ప్రత్యేకమైనది. రాజసం ఉట్టిపడేలా ఉండే బుల్లెట్ మోడల్ దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే మోడళ్లలో ఒకటి. అనేక దశాబ్దాలుగా ద్విచక్రవాహనాల శ్రేణిలో బుల్లెట్ స్థానం చెక్కుచెదరలేదు.

1932లో వచ్చిన బుల్లెట్ ఇప్పటికీ 350 సీసీ సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతోంది. గతేడాది రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా బుల్లెట్ ను కూడా బీఎస్6 సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరించింది. ఈ క్రమంలో తాజాగా బుల్లెట్ వేరియంట్ల ధరలను గరిష్టంగా రూ.3,447 వరకు పెంచింది.

బుల్లెట్ 350 స్టాండర్డ్ మోడల్ ధర గతంలో రూ.1,27,094 కాగా, ఇప్పుడది రూ.1,30,228కి పెరిగింది. బుల్లెట్ 350 ఈఎస్ (ఎలక్ట్రిక్ స్టార్ట్) ధర గతంలో రూ.1,42,705 కాగా, ఇప్పుడది రూ.1,46,152కి పెరిగింది. బుల్లెట్ ఫారెస్ట్ గ్రీన్, బ్లాక్ షేడ్స్ ధర గతంలో రూ.1,33,261 కాగా, ఇప్పుడా మోడళ్ల ధర రూ.1,36,502కి చేరింది.