మేడారం జాతరలో కలకలం రేపిన కరోనా

27-02-2021 Sat 17:02
  • మేడారం మినీ జాతరకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు
  • ముగ్గురు దేవాదాయశాఖ సిబ్బందికి కరోనా
  • పలువురిలో కరోనా లక్షణాలు
Corona cases identified in Medaram Jatara

మేడారం సమ్మక్క, సారలమ్మలను భక్తులు ఎంతో భక్తిభావంతో కొలుచుకుంటుంటారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం జాతర జరుగుతుంటుంది. అయితే, భక్తుల కోసం మధ్యలో మినీ జాతరను నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మినీ జాతర జరుగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు తరలి వస్తున్నారు. మరోవైపు జాతరలో కరోనా కలకలం రేపింది.

దేవాదాయశాఖకు చెందిన ముగ్గురు సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరికొందరిలో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో వారందరినీ క్వారంటైన్ కు తరలించారు. వీరితో సన్నిహితంగా మెలిగిన వారందరూ హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల్లో ఎంత మందికి కరోనా ఉందనే అనుమానాలు అధికారులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. భక్తులందరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలని అధికారులు కోరుతున్నారు.