Harish Babu: ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు యువకుడు

Telugu youth died in Australia in suspicious conditions
  • ఆరేళ్లుగా అడిలైడ్ లో వుంటున్న హరీశ్ బాబు
  • స్వస్థలం ప్రకాశం జిల్లా పమిడిపాడు
  • ప్రసవం కోసం భారత్ వచ్చిన భార్య
  • తిరిగి ఆస్ట్రేలియా వెళ్లే క్రమంలో భర్తకు ఫోన్
  • ఎంతకీ స్పందించని హరీశ్ బాబు
  • ఫ్లాట్ లో శవమై కనిపించిన వైనం
ఆస్ట్రేలియాలో ఓ తెలుగు యువకుడు మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఫ్లాట్ లో ఒంటరిగా ఉన్న యువకుడు ఎలా మృతి చెందాడన్నది తెలియరాలేదు. ఏపీలోని ప్రకాశం జిల్లా పమిడిపాడు (కొరిశపాడు మండలం)కు చెందిన హరీశ్ బాబు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. గత 6 సంవత్సరాలుగా హరీశ్ బాబు అడిలైడ్ ప్రాంతంలోని సల్స్ బరీలో నివసిస్తున్నాడు.

హరీశ్ బాబు భార్య గర్భవతి కావడంతో కొన్నాళ్ల కిందట పుట్టింటికి వచ్చింది. ఇక్కడే ప్రసవించిన ఆమె కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా వెళ్లలేకపోయింది. ఆంక్షలు సడలించడంతో ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమె విమానం ఎక్కేందుకు చెన్నై చేరుకుంది. అయితే ఆస్ట్రేలియాలో ఉన్న భర్తకు ఫోన్ చేయగా, అతడు ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె ఆందోళనకు గురైంది.

దీంతో బంధువులు హరీశ్ ఉంటున్న ప్రాంతంలోని ఇతరులకు ఫోన్ చేయడంతో అతడు తన ఫ్లాట్ లో విగతజీవుడిగా పడివున్న విషయం వెల్లడైంది. దాంతో హరీశ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. హరీశ్ బాబు తన ఫ్లాట్ లో ప్రస్తుతం ఒక్కడే ఉంటున్నాడని, మరి ఎలా మరణించాడో తెలియడంలేదని భార్య కన్నీరుమున్నీరవుతోంది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు.
Harish Babu
Death
Australia
Prakasam District
Andhra Pradesh
India

More Telugu News