USA: సౌదీపై అమెరికా ఆంక్షలు.. సౌదీలకు వీసా నిషిద్ధం

  • జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్యపై అగ్రరాజ్యం సంచలన నిర్ణయం
  • జర్నలిస్టుల, అసమ్మతి గళాలను అణచేసే వారిపై చర్యలు
  • సౌదీ నిఘా విభాగం చీఫ్ సహా 76 మందిపై ఆంక్షలు, వీసా బ్యాన్
  • ఖషోగిని చంపించింది యువరాజు సల్మానే అని ఆరోపణ
  • సల్మాన్ పై చర్యలేవీ లేకుండానే చిన్న చిన్న ఆంక్షలతో సరి
US imposes sanctions and visa bans on Saudis for Jamal Khashoggis killing

సంచలనం సృష్టించిన జమాల్ ఖషోగి హత్యకు సంబంధించి సౌదీ అరేబియాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశ పౌరులకు వీసా నిషేధించింది. ఖషోగిని చంపించింది యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అని ఆరోపించిన అమెరికా.. ఆయనపై కఠిన చర్యలేవీ తీసుకోకుండా ఆంక్షలతో సరిపెట్టింది.

మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సౌదీ అరేబియాకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేయూతనిచ్చారని, అది ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్న క్రమంలోనే అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఆంక్షలు విధించారు.

 కాగా, సౌదీ నిఘా విభాగం అధిపతి అహ్మద్ అల్ అసిరి, సౌదీ రాయల్ గార్డ్స్ ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ ఫోర్స్ (ఆర్ఐఎఫ్)పై అమెరికా ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది. అసిరికిగానీ, ఆర్ఐఎఫ్ లోని సభ్యులకు గానీ అమెరికాలో ఆస్తులుంటే.. వాటి క్రయవిక్రయాలపై నిషేధం విధించింది. అమెరికన్లు ఎవరూ ఆ ఆస్తులను కొనకూడదని స్పష్టం చేసింది.

76 మంది సౌదీ పౌరులకు అమెరికా ప్రభుత్వం వీసాను నిషేధించింది. జర్నలిస్టులు, ప్రభుత్వంపై అసమ్మతి వెలిబుచ్చే వారిపై దాడులకు తెగబడితే.. అలాంటివారిపై ఆంక్షలు విధించేలా అమెరికా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ విధానాల ప్రకారమే 76 మందిపై వీసా నిషేధాన్ని విధించింది. వారి కుటుంబ సభ్యుల్లో ఎంపిక చేసిన వారికే వీసా ఆంక్షలు వర్తిస్తాయి.

తమ సరిహద్దుల్లో భద్రతకే పెద్ద పీట వేస్తామని, ప్రభుత్వ అసమ్మతి గళం వినిపించే వారిపై దాడులను సహించబోమని విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ ప్రకటించారు. అలాంటి ద్వేషాన్ని తమ గడ్డపైకి రానివ్వబోమని తేల్చి చెప్పారు. మరోవైపు తమ పరిశీలనలో ఉండే సౌదీ అరేబియా, ఇతర దేశాలపై మానవ హక్కుల నివేదికను త్వరలోనే విడుదల చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.

జమాల్ ఖషోగిని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చంపించాడంటూ అమెరికా ఆరోపించింది. శుక్రవారం ఆ నివేదికను విడుదల చేసింది. 2018 అక్టోబర్ 2న ఖషోగిని ఇస్తాంబుల్ లో ఉన్న సౌదీ కాన్సులేట్ కు పిలిపించి చంపి, ముక్కలుముక్కలుగా నరికించారని నివేదికలో పేర్కొంది. ఇప్పటిదాకా ఖషోగి మృతదేహం కూడా లభించలేదని వెల్లడించింది. అమెరికా పౌరుడైన ఖషోగి.. సౌదీ యువరాజు అవినీతిని బయటపెట్టాడని, అందుకే ఆయన్ను యువరాజు చంపించారని పేర్కొంది.

More Telugu News