Alister Cook: విరాట్ కోహ్లీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అలిస్టర్ కుక్!

  • మొతేరా పిచ్ స్పిన్ కు అనుకూలం
  • రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
  • ఆటకు అనుకూలం కానే కాదన్న కుక్
Alister Cook Comments on Kohli Comment

మొతేరా పిచ్ బ్యాటింగ్ కు అత్యంత అనుకూలమైనదేనని, ఎటొచ్చీ ఆటగాళ్లు నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తే సరిపోతుందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించడంపై ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ స్పందించాడు.

 ఈ వికెట్ ఎంతమాత్రమూ బ్యాటింగ్ కు అనువైనది కాదని, ఇటువంటి పిచ్ పై ఆడటం ఎంతో కష్టమని వ్యాఖ్యానించాడు. ఇది అసలు పిచ్ కాదని, వికెట్ అంచనా తప్పని వ్యాఖ్యానించిన ఆయన, విరాట్ కోహ్లీ పిచ్ తయారు చేసిన వారికి అనుకూలంగా మాట్లాడారని ఆరోపించారు.

ఇదే మ్యాచ్ లో ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసుంటే, అప్పుడు కూడా విరాట్ ఇలాగే మాట్లాడి వుండేవాడా? అని ప్రశ్నించారు. కేవలం తొలి ఇన్నింగ్స్ లో మాత్రమే ఈ వికెట్ బ్యాటింగ్ కు అనుకూలించిందని అన్న కోహ్లీ మాటలను సైతం కుక్ ఖండించాడు. కోహ్లీ తో పాటు జో రూట్ కూడా ఈ మ్యాచ్ లో ఆడాడని గుర్తు చేస్తూ, ఇరు జట్లలోనూ స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొనే సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నారని, కానీ, వారే మట్టిని లేపుతూ వస్తున్న బంతులను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారని అన్నారు.

వేసిన ప్రతి బాల్ స్కిడ్ అవుతుంటే ఎలా ఆడతారని, తనకు తెలిసిన ఇండియాలోని క్రికెట్ పిచ్ లతో పోలిస్తే, ఈ పిచ్ పై రెడ్ బాల్ ఎంతో తిరిగిపోయిందని అన్నారు. ఇక మూడవ టెస్ట్ లో ఓడిపోయిన ఇంగ్లండ్ కు మద్దతుగా పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. టెస్టులకు ఎంత మాత్రమూ పనికిరాని పిచ్ లను తయారు చేశారని ఆరోపించారు.

ఇదే సమయంలో ఇంగ్లండ్ లో సీమింగ్ పిచ్ ల గురించి భారత మాజీలు ప్రస్తావిస్తుండటం గమనార్హం. భారత క్రికెట్ జట్టు, ఇంగ్లండ్ లో వారికి అనుకూలంగా తయారు చేయించుకున్న పిచ్ లపై వికెట్లను కోల్పోయి, మ్యాచ్ లను ఓడిపోయినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారంతా ఏమయ్యారని అడుగుతున్నారు.

More Telugu News