USA: బైడెన్ వచ్చాక తొలి సైనిక చర్య... సిరియాపై బాంబుల వర్షం!

  • ఇరాక్ ఉగ్రవాదులు లక్ష్యంగా దాడులు
  • 22 మంది మరణించినట్టు వార్తలు
  • ఒక్కరే చనిపోయారన్న ఇరాక్ సైనికాధికారి
First Air Strikes after Biden Oath

అమెరికా వైమానిక దళం, సిరియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఇరాక్ గ్రూపులే లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. యూఎస్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ మద్దతుతో నడుస్తున్న ఇరాక్ ఉగ్రవాదుల స్థావరాలు టార్గెట్ గా ఈ దాడి జరిగినట్టు సమాచారం. బాంబుల ధాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయని, మొత్తం 22 మంది వరకూ మరణించారని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్షుడిగా గత నెల 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, ఓ దేశంపై వాయుసేన దాడులు చేయడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో అమెరికా వైమానిక దాడుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారని, పలువురికి గాయాలు అయ్యాయని, వారికి చికిత్స జరుగుతోందని ఇరాక్ సైనికాధికారి ఒకరు చెప్పడం గమనార్హం. వైమానిక దాడులపై స్పందించిన అమెరికా, ఈ నెల ప్రారంభంలో అమెరికా సైన్యాన్ని టార్గెట్ చేసుకుని ఇరాక్ మిలిటెంట్లు దాడులు చేశారని, అందుకు ప్రతీకారంగానే యుద్ధ విమానాలు పంపామని వెల్లడించింది.

కాగా, ఈ దాడుల్లో సిరియా, ఇరాక్‌ సరిహద్దుల్లో ఉన్న కతాబ్‌ హిజ్బుల్లా గ్రూప్ నకు మారణాయుధాలను సరఫరా చేస్తున్న మూడు లారీలు ధ్వంసమయ్యాయి. ఇరాక్ లో శాంతికోసం ప్రయత్నిస్తున్న తమ సైన్యానికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ పేర్కొన్నారు. సిరియాలో తమ టార్గెట్ తమకు తెలుసునని అన్నారు. ఇరాక్ లో అమెరికా సైన్యం, వారి కుటుంబీకులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, వీటిని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.

More Telugu News