Lockdown: ఆర్థిక మాంద్యం నుంచి బయటపడ్డ ఇండియా... కరోనా తరువాత తొలి సారి వృద్ధి గణాంకాలు!

  • లాక్ డౌన్ కారణంగా గత సంవత్సరం కుదేలైన వృద్ధి
  • డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో పాజిటివ్ సంకేతాలు
  • ఈ సంవత్సరం 10 శాతానికి పైగా జీడీపీ పెరుగుదల అంచనా
Indian GDP Growth is Positive in December Quarter

రెండు త్రైమాసికాల తరువాత, ఆర్థిక మాంద్యం నుంచి భారతావని బయట పడిందన్న సంకేతాలు వెలువడ్డాయి. గత సంవత్సరం జూన్, సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికాల్లో కరోనా, లాక్ డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వృద్ధి, డిసెంబర్ త్రైమాసికంలో పుంజుకుంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా గణాంకాల మేరకు గడచిన అక్టోబర్ - డిసెంబర్ మధ్య జీడీపీ 0.4 శాతం పెరిగింది. దీంతో 2020 చివరి త్రైమాసికంలో అభివృద్ధిని కళ్లజూసిన దేశాల సరసన ఇండియా కూడా నిలిచినట్లయింది.

కాగా, జూన్ త్రైమాసికంలో 23.9 శాతం పతనమైన జీడీపీ, ఆపై సెప్టెంబర్ త్రైమాసికంలో 7.5 శాతం దిగజారిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని సాంకేతిక మాంద్యంగానే పరిగణించాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అన్ లాక్ ప్రక్రియ మొదలు కాగానే స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదల ప్రారంభమైందని గుర్తు చేశారు.

ఇదిలావుండగా, గడచిన జనవరి మాసంలో మౌలిక రంగ వృద్ధి 0.1 శాతంగా నమోదు కావడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 10.5 శాతంగా ఉంటుందని ఈ నెల తొలి వారంలో జరిగిన ఆర్బీఐ పరపతి సమీక్ష అభిప్రాయపడగా, 11.5 శాతం వరకూ భారత జీడీపీ పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసిన సంగతి తెలిసిందే.

More Telugu News