చంద్రబాబు, నారా లోకేశ్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంబటి రాంబాబు

26-02-2021 Fri 19:06
  • కుప్పంలో చంద్రబాబు పర్యటన
  • జగన్ దెబ్బకు చంద్రబాబు కుప్పం బాట పట్టాడన్న అంబటి
  • నామినేషన్ వేయడానికి కూడా రాని బాబు ఇప్పుడొచ్చాడని ఎద్దేవా 
  • లోకేశ్ సీఎం మెటీరియల్ కాదని వ్యాఖ్యలు
  • పిచ్చిపట్టి ఏదేదో మాట్లాడుతున్నాడని విమర్శలు
  • భువనేశ్వరి తనయుడ్ని పట్టించుకోవాలని సూచన
Ambati Rambabu slams Chandrababu and Lokesh

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లపై అంబటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లని చంద్రబాబు... సీఎం జగన్ దెబ్బకు కుప్పం వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబు కుప్పంలో మూడ్నాలుగు రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారంటే అది జగన్ ప్రభావమేనని అన్నారు.

కుప్పంలో చంద్రబాబు 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారని, అలాంటి కంచుకోటలో పంచాయతీ ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచింది కేవలం 14 పంచాయతీలేనని తెలిపారు. సీఎం జగన్ గొప్పదనం ఏంటో కుప్పంలోని టీడీపీ నేతలకు తెలిసిందని అన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి దింపి, ఆ తర్వాత అతడిని అణచివేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబు... ఇవాళ అదే జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం సీఎం జగనేనని అన్నారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలతో కూడిన చంద్రబాబు ఫ్లెక్సీలు కుప్పంలో కనిపిస్తున్న తీరే అందుకు నిదర్శనమని అంబటి వ్యాఖ్యానించారు.  

అధికారంలో ఉన్నప్పుడే మేనిఫెస్టో అమలు చేయలేని చంద్రబాబు, ఇప్పుడు విపక్షంలో ఉంటూ మేనిఫెస్టో ప్రకటించి ఏంచేస్తారని విమర్శించారు. ఇంతకంటే దగాకోరు ఇంకెవరైనా ఉంటారా? అని ప్రశ్నించారు. 'గతంలో చంద్రగిరిని వదిలేశావు, ఇప్పుడు కుప్పంను కూడా వదిలేసి మరో చోటుకు వెళతావా?' అని నిలదీశారు. ఏదేమైనా చంద్రబాబు రాకతో కుప్పం టీడీపీ నేతలు సంతోషంగా ఉన్నారని, ఏనాడూ కుప్పం రాని చంద్రబాబు ఇప్పుడు కుప్పంలో పర్యటిస్తుండడం వారిని ఎంతో ఆనందానికి గురిచేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు.

ఇక లోకేశ్ పైనా అంబటి అదేస్థాయిలో విరుచుకుపడ్డారు. నారా లోకేశ్ సీఎం మెటీరియల్ కాదని అభిప్రాయపడ్డారు. అందరు సీఎంల కొడుకులు ముఖ్యమంత్రి కాలేరని, అందుకు దమ్ముండాలన్నారు. తనను ఎవరూ గుర్తించడంలేదన్న అసహనంలో లోకేశ్ ఏదేదో మాట్లాడుతున్నాడని విమర్శించారు. లోకేశ్ వచ్చిన తర్వాత సైకిల్ తుక్కుతుక్కు అయిపోయిందని అన్నారు.

జగన్ గన్ లో బుల్లెట్లు లేవు అంటూ నారా లోకేశ్ పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని.... జగన్ గన్ లో బుల్లెట్లు లేకే నీవు మంగళగిరిలో ఓటమి పాలయ్యావా? కుప్పంలో మీరు 14 పంచాయతీలకు పరిమితమైపోయింది జగన్ గన్ లో బుల్లెట్లు లేకేనా? 2019లో 23 స్థానాలకు పరిమితమైంది కూడా జగన్ గన్ లో బుల్లెట్లు లేనందువల్లేనా? అని నిలదీశారు. హెరిటేజ్ వ్యాపార వ్యవహారాలతో తలమునకలుగా ఉన్న నారా భువనేశ్వరి ఇకనైనా కుమారుడు లోకేశ్ ను పట్టించుకోవాలని, ఎక్కడైనా మంచి వైద్యుడికి చూపించాలని అంబటి వ్యాఖ్యానించారు.