Yusuf Pathan: క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన యూసుఫ్ పఠాన్

  • అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన యూసుఫ్
  • 57 వన్డేలు, 22 టీ20లు ఆడిన యూసుఫ్
  • 2012లో చివరి వన్డే ఆడిన ఆల్ రౌండర్
Yusuf Pathan retires from all formats

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ అన్ని ఫార్మాట్లకు రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని యూసుఫ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. తనకు ఇంతకాలం మద్దతుగా నిలిచిన కుటుంబం, స్నేహితులు, అభిమానులు, కోచ్ లు, టీములకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. ఇండియా తరపున యూసుఫ్ 57 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. 2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్, 2011 ఐసీసీ వరల్డ్ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టులో యూసుఫ్ పఠాన్ సభ్యుడిగా ఉన్నాడు. వన్డేల్లో 810 పరుగులు, టీ20ల్లో 236 పరుగులు చేశాడు. 46 వికెట్లను పడగొట్టాడు.

తన జీవితంలో క్రికెట్ ఇన్నింగ్స్ కు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని యూసుఫ్ తెలిపాడు. భారత్ కు రెండు ప్రపంచకప్ లను అందించడం, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను తన భుజాల మీద మోయడం రెండూ తనకు చిరస్మరణీయాలని చెప్పాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన యూసుఫ్... 2012లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డేను ఆడాడు. యూసుఫ్ సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ కూడా టీమిండియాకు ఎన్నో ఏళ్ల పాటు ఆడాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.

More Telugu News