Assemble Elections: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

  • 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు
  • నేటి నుంచి కోడ్ అమలు
  • వివరాలు వెల్లడించిన సీఈసీ
  • అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు
  • మే 2న ఫలితాలు
CEC announces Assembly election schedule for four states and one union territory

దేశంలో అసెంబ్లీ ఎన్నికల గంట మోగింది. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు తాజా షెడ్యూల్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు.

పశ్చిమ బెంగాల్ లో 294, తమిళనాడులో 234, అసోంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు చేపడతారు. బెంగాల్ లో లక్షకు పైగా పోలింగ్ కేంద్రాలు, తమిళనాడులో 89 వేల పోలింగ్ కేంద్రాల్లో, కేరళలో 40 వేల పోలింగ్ కేంద్రాల్లో, అసోంలో 33 వేల పోలింగ్ కేంద్రాల్లో, పుదుచ్చేరిలో 1,500 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ వివరాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు.

పండుగలు, పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ రూపొందించామని వెల్లడించారు. జనవరి నాటికి సిద్ధమైన ఓటరు జాబితాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని వివరించారు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.

ఇక ఎన్నికల కోడ్ నేటి నుంచి అమలు అవుతుందని సునీల్ ఆరోరా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, అక్కడికి తగినన్ని భద్రతా బలగాలను పంపిస్తామన్నారు. పశ్చిమ బెంగాల్ కు ఇద్దరు ప్రత్యేక పోలీసు పరిశీలకులను నియమిస్తున్నామని వివరించారు.

ఇటీవల నిర్వహించిన ఎన్నికలు తమకు సంతృప్తినిస్తున్నాయని, 7 కోట్లకు పైగా ఓటర్లు ఉన్న బీహార్ లో సజావుగా ఎన్నికలు నిర్వహించామని పేర్కొన్నారు. కరోనా వేళ కూడా సమర్థంగా ఎన్నికలు జరుపుతున్నామని పేర్కొన్నారు. తాజాగా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించే ఎన్నికల్లో 18.68 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ రోడ్ షోలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ సమయం గంటసేపు పెంచుతామని అన్నారు.

ఆయా రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ జరిగే తేదీలు ఇవే...

పశ్చిమ బెంగాల్- తొలివిడత మార్చి 27, రెండో విడత ఏప్రిల్ 1, మూడో విడత ఏప్రిల్ 6, నాలుగో విడత ఏప్రిల్ 10, ఐదో విడత ఏప్రిల్ 17, ఆరో విడత ఏప్రిల్ 22, ఏడో విడత ఏప్రిల్ 26, ఎనిమిదో విడత ఏప్రిల్ 29.
తమిళనాడు- ఏప్రిల్ 6
కేరళ- ఏప్రిల్ 6
పుదుచ్చేరి- ఏప్రిల్ 6
అసోం- తొలివిడత మార్చి 27, రెండో విడత ఏప్రిల్ 1, మూడో విడత ఏప్రిల్ 6.

ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: మే 2
ఇక 16 రాష్ట్రాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నామని, వీటికి ప్రత్యేక నోటిఫికేషన్ ఉంటుందని సీఈసీ సునీల్ అరోరా తెలిపారు.

More Telugu News