హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ దత్తాత్రేయ పట్ల అమానుషంగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

26-02-2021 Fri 17:19
  • హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఘటన
  • పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ సభ్యులు
  • సభ నుంచి వెళ్తున్న గవర్నర్ ను అడ్డుకున్న వైనం
Congress MLAs misbehaves with Bandaru Dattatreya

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రసంగ ప్రతులను  చించేయడమే కాకుండా, సభలో అభ్యంతరకరమైన నినాదాలను చేశారు. దాదాపు ఆయనపై దాడి చేసే వరకు వెళ్లారు.

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించేందుకు బండారు దత్తాత్రేయ అసెంబ్లీకి వచ్చారు. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్పీకర్ యత్నించినా వారు వినలేదు. తమ నినాదాలను ఆపలేదు. సభలో గందరగోళం సృష్టించారు.

 ఈ నేపథ్యంలో తన ప్రసంగ ప్రతిలోని చివరి వాక్యాలను మాత్రమే చదివి దత్తాత్రేయ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సభ నుంచి వెళ్తున్న గవర్నర్ ను కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు. అయితే మార్షల్స్, సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత సభలో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు.