Vishal Gunny: నరసరావుపేట డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం: ఎస్పీ

  • సంచలనం సృష్టించిన విద్యార్థిని అనూష హత్య కేసు
  • క్లాస్ మేటే హంతకుడని ఎస్పీ వెల్లడి
  • మరో యువకుడితో చనువుగా ఉందని అనుమానించాడని వివరణ
  • నిర్జన ప్రాంతంలో గొంతు నులిమి చంపాడని స్పష్టీకరణ
SP Vishal Gunny reveals Anusha murder case details

గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యకు దారితీసిన కారణాలను పోలీసులు స్వల్ప వ్యవధిలోనే గుర్తించారు. అనూషను చంపింది విష్ణువర్ధన్ రెడ్డి అని గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. అనూష, విష్ణువర్ధన్ రెడ్డి క్లాస్ మేట్స్ అని తెలిపారు.

ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించిన విశాల్ గున్నీ.... అనూష మరో యువకుడితో చనువుగా వుంటోందన్న అనుమానంతో విష్ణువర్ధన్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. అనూషను విష్ణువర్ధన్ రెడ్డి పాలపాడు రోడ్డులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెను నిలదీశాడని తెలిపారు. ఆమె చెప్పిన సమాధానంతో అతడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడని, ఆపై గొంతు నులిమి చంపేశాడని వివరించారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు సంఘటన స్థలంలో ఆధారాలు లేకుండా చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నించాడని ఎస్పీ వెల్లడించారు.

మృతదేహాన్ని అక్కడ కాలువలో పడవేసేందుకు ప్రయత్నించాడని, కానీ స్థానికులు అందించిన సమాచారంతో హత్య విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. అనూష హత్య ఆధారాలను ఎంతో వేగంగా, శాస్త్రీయంగా సేకరించామని, ఈ కేసులో విష్ణువర్ధన్ రెడ్డికి శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. త్వరగా విచారణ జరపాలని కోర్టును కూడా కోరతామని చెప్పారు.

More Telugu News