బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్... కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు

26-02-2021 Fri 16:12
  • హైదరాబాదులో నాటకీయ పరిణామాలు
  • ఎమ్మెల్సీ బరిలో దిగిన దిలీప్ కుమార్
  • బండి సంజయ్ దౌత్యంతో నామినేషన్ ఉపసంహరణ
  • బీజేపీ అభ్యర్థికి మద్దతు
  • సీఎం కేసీఆర్ పై ఈడీ కన్నేసిందని వెల్లడి
  • ఏ క్షణాన్నయినా ఈడీ దాడులు జరగొచ్చని వ్యాఖ్యలు
Former mlc Dilip Kumar joins BJP

మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఇవాళ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆయనకు స్వాగతం పలికారు. కాగా, దిలీప్ కుమార్ గతంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్న అనంతరం ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి.

వాస్తవానికి కపిలవాయి దిలీప్ కుమార్ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి నామినేషన్ వేశారు. అయితే బండి సంజయ్ దౌత్యంతో దిలీప్ కుమార్ బీజేపీలో చేరడమే కాదు, తన నామినేషన్ ను కూడా ఉపసంహరించుకున్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాంచందర్ రావుకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఓ కుటిల రాజకీయనేత అని విమర్శించారు. గతంలో మాజీ ప్రధాని పీవీని తాను, కేసీఆర్ కలిశామని వెల్లడించారు. అయితే ఆ సమయంలో పీవీని కేసీఆర్ సమైక్యవాది అని పేర్కొన్నారని దిలీప్ కుమార్ స్పష్టం చేశారు. నాడు సమైక్యవాది అని పిలిచిన పీవీని ఇప్పుడు కేసీఆర్ కీర్తించడం రాజకీయమేనని అన్నారు. పీవీ కుమార్తె వాణికి టికెట్ ఇవ్వడం ద్వారా బ్రాహ్మణ ఓట్లు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

పీవీపై కేసీఆర్ కు ఏనాడూ అభిమానం లేదని, ఈ ఎన్నికల్లో వాణీదేవిని బలిపశువును చేస్తున్నారని తెలిపారు. వీలైతే వాణీదేవి కూడా తన నామినేషన్ వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని దిలీప్ కుమార్ సూచించారు. సీఎం కేసీఆర్ సంపాదన ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ కంటే ఎక్కువని, ఆ సంపదకు సంబంధించిన లెక్కలన్నీ ఈడీ వద్ద ఉన్నాయన్నారు. ఏ క్షణాన అయినా ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని దిలీప్ కుమార్ పేర్కొన్నారు.