Nara Lokesh: స్టీల్ ప్లాంట్ పై జగన్ పోరాడే పరిస్థితిలేదు... కేసుల మాఫీ అంశం అడ్డొస్తోంది: నారా లోకేశ్

  • స్టీల్ ప్లాంట్ అంశంలో సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు
  • జగన్ పిరికివాడని వ్యాఖ్యలు
  • ధైర్యముంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేవాడని వెల్లడి
  • ఈ 21 నెలల్లో ఏంచేశాడంటూ ప్రశ్నించిన లోకేశ్ 
Nara Lokesh comments on CM Jagan

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై జగన్ పోరాడే పరిస్థితి లేదని, తన కేసుల మాఫీ కోసం జగన్ రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని విమర్శించారు. జగన్ కు ధైర్యం లేదని, ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేవారని అన్నారు.

ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఈ 21 నెలల్లో ఏంచేశారని ప్రశ్నించారు. పెన్షన్ డబ్బులు కేవలం రూ.250 మాత్రమే పెంచి ప్రజలను మోసం చేశారని తెలిపారు. అమ్మఒడి పథకాన్ని అర్ధఒడి చేశారని విమర్శించారు. మునిగిపోయే భూములను ఇళ్ల పట్టాలుగా ఇచ్చారని, ఏంచేశారని వైసీపీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయాలని నిలదీశారు.

 "పురపాలక మంత్రిగా ఉన్న బొత్సను సూటిగా అడుగుతున్నా... ఇప్పటివరకు ఒక్క టిడ్కో ఇంటిని కట్టారా? ఒక్క వీధి దీపం మార్చారా? ఎక్కడైనా ఒక రోడ్డయినా వేశారా? ఏంచేశారు ఇన్నాళ్లూ? అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు... దాన్ని కోర్టు కొట్టివేసింది. టిడ్కో ఇళ్లలో అవినీతి అన్నారు... మౌలిక సదుపాయాల్లో అవినీతి అన్నారు... దాన్ని కూడా కోర్టు కొట్టివేసింది. ఈ ప్రభుత్వం అప్పీళ్లకు కూడా వెళ్లే పరిస్థితిలేదు" అని విమర్శించారు.

"జగన్ పిరికివాడు కాబట్టే ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేశాడు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంశాన్ని కూడా వదిలేశాడు. నువ్వు పోరాడు మేం అండగా ఉంటాం అంటూ మా అధినేత కూడా చెప్పారు. ఈయనేమో లేఖ రాశానంటాడు... అక్కడేమో లేఖ అందలేదంటారు. ధైర్యం ఉన్నవాడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీరణకు నేను వ్యతిరేకం అని జగన్ చెప్పాలి" అని అన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం అంశం ప్రైవేటీకరణ నిర్ణయం ఓ కమిటీ ద్వారా తీసుకున్నారని, ఆ కమిటీలో సభ్యుడు ఎవరో కాదని, వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డేనని నారా లోకేశ్ వెల్లడించారు. ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్న అవినాశ్ రెడ్డి ప్రైవేటీరణ నిర్ణయంపై కనీసం అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదని ఆరోపించారు. మరి ఎందుకు ఈ 22 మంది ఎంపీలు? అని లోకేశ్ విమర్శించారు.

More Telugu News