ISRO: ఇస్రో మణిహారంలో మరో కలికితురాయి.. ఎస్ఎస్ఎల్వీ !

  • పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ సరసన ఎస్ఎస్ఎల్వీ
  • మార్చి చివర్లో లేదా ఏప్రిల్ లో ప్రయోగానికి ఏర్పాట్లు
  • చిన్న ఉపగ్రహాల ప్రయోగానికి మేలు
  • 500 కిలోల బరువును మోసుకెళ్లగల రాకెట్
  • మూడు రోజుల్లోనే ఆరుగురితో బిగింపు
Isro gearing up to launch SSLV its new generation mini rocket launch system

ఇప్పటికే మన ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించడానికి పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ  రాకెట్లు వున్నాయి. ఇప్పుడు వీటికి మరొకటి తోడు రాబోతోంది. ఎన్నెన్నో మైలు రాళ్లను అవలీలగా సాధించేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మణిహారంలో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) అనే మరో కలికితురాయి జోడీ కాబోతోంది. సింపుల్ గా చెప్పాలంటే చిన్న ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లే రాకెట్ అన్నమాట.

ఇప్పటికే ఐదు తరాల రాకెట్లను తయారు చేసిన ఇస్రో.. ఇప్పుడు ఈ కొత్త తరం ఎస్ఎస్ఎల్వీలకు రూపకల్పన చేస్తోంది. దానిని పరీక్షించేందుకు మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదట్లో ఎస్ఎస్ఎల్వీడీ1 ప్రయోగం చేయనుంది. ‘‘మొదటి ఎస్ఎస్ఎల్వీలో భూ పరిశీలనా ఉపగ్రహం ఈవోఎస్02ను ప్రయోగించనున్నాం’’ అని ఇస్రో చైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి శివన్ చెప్పారు.

ఎందుకివి?

పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీలున్నా.. అవి పెద్ద పెద్ద ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు వీలుగా తయారు చేసినవి. భూకక్ష్యలోకి ఎక్కువ బరువులను అవి మోసుకెళ్లగలవు. అయితే, చిన్న చిన్న ఉపగ్రహాలను పంపేటప్పుడు వాటి వాడకం వల్ల ఖర్చు తడిసిమోపెడవుతోంది. పైగా వాటిని బిగించేందుకే రెండు నెలల దాకా టైం పడుతుంది. ఇటు ప్రపంచంలో చిన్న ఉపగ్రహాల ప్రయోగం ఎక్కువైంది. ఆ డిమాండ్ కు తగ్గట్టు, ఖర్చు తగ్గించుకునేట్టు ఎస్ఎస్ఎల్వీలకు ఇస్రో రూపమిచ్చింది.

మూడు దశల ఘన ఇంధన ఇంజన్లుండే ఎస్ఎస్ఎల్వీ 500 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. దీని ద్వారా ఒకేసారి నానో, మైక్రో, స్మాల్ శాటిలైట్లనూ పంపించేందుకు వీలవుతుంది. కేవలం 3 రోజుల్లోనే రాకెట్ బిగింపు పూర్తవుతుంది.

కొన్ని రోజుల క్రితం ఎస్ఎస్ఎల్వీల గురించి మాట్లాడిన శివన్.. పీఎస్ఎల్వీలను బిగించేందుకు 600 మంది 60 రోజులు కష్టపడితే.. ఎస్ఎస్ఎల్వీలను కేవలం ఆరుగురు మూడు రోజుల్లోనే పూర్తి చేస్తారని చెప్పారు. కాగా, చిన్న ఉపగ్రహాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుండడంతో ఎస్ఎస్ఎల్వీలపై దృష్టి సారించామని ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి. నారాయణన్ ప్రకటించారు.

ఎస్ఎస్ఎల్వీడీ1 పరీక్షలో నెగ్గితే భవిష్యత్ ప్రయోగాలపై ప్రణాళికలు వేస్తామని చెప్పారు. ఇప్పటికే ఎస్ఎస్ఎల్వీ డీ2 ప్రయోగం కోసం అమెరికాలోని సియాటిల్ లోని స్పేస్ ఫ్లైట్ ఐఎన్ సీ అనే సంస్థ ఒప్పందం చేసుకుందని చెప్పారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దాని ప్రయోగం జరుగుతుందన్నారు. కాగా, ఇప్పటిదాకా ఇస్రో ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్3 వంటి రాకెట్లను ప్రయోగించింది.

More Telugu News