సరిహద్దు సమస్యల పరిష్కారానికి హాట్​ లైన్​: భారత్​ కు చైనా ప్రతిపాదన

26-02-2021 Fri 11:52
  • హాట్దా లైన్ ద్వారా ఎప్పటికప్పుడు చర్చలు కొనసాగింపు 
  • బలగాల ఉపసంహరణపై సంతృప్తి వ్యక్తం చేసిన చైనా 
  • మాస్కో ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందేనన్న భారత్ 
  • శాంతికి భంగం కలిగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిక   
  • ఫోన్ లో మాట్లాడుకున్న ఇరు దేశాల మంత్రులు
MEA Jai Shankar Dialed Chinese Counter part

తూర్పు లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి మిగిలి ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చైనాకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. ఘర్షణ వాతావరణం నెలకొన్న అన్ని ప్రాంతాల్లోనూ బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లోనూ ఇరుపక్షాలూ బలగాలను తగ్గించుకోవాలని, శాంతి సామరస్యాల పునరుద్ధరణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందిస్తూ.. సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపేందుకు ఓ హాట్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. గురువారం రెండు దేశాల విదేశాంగ మంత్రులు దాదాపు 75 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారు. చర్చలకు సంబంధించిన వివరాలను శుక్రవారం విదేశాంగ శాఖ వెల్లడించింది.

మాస్కో ఒప్పందానికి కట్టుబడాలి

రష్యా రాజధాని మాస్కోలో జరిగిన షాంఘై కో ఆపరేషన్ సదస్సు సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ లో ఇరు దేశాల మధ్య కుదిరిన (మాస్కో) ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందిగా చైనాకు జైశంకర్ తేల్చి చెప్పారు. సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు వైఖరి వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సరిహద్దు సమస్య తీరేందుకు సమయం పట్టొచ్చని, కానీ, దాని కోసం హింస ద్వారా శాంతి సామరస్యాలను పాడు చేస్తే ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదముందని అన్నారు. సరిహద్దుల్లో బలగాలను ఉపసంహరించుకోవాలన్న మాస్కో ఒప్పందాన్ని ఆయన గుర్తు చేశారు. చర్చలు కొనసాగిస్తూనే ఉండాలని సూచించారు.

కాగా, ప్రస్తుతం బలగాల ఉపసంహరణపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి సామరస్య పునరుద్ధరణలో ఇది ముఖ్యమైన అడుగు అని ఆయన చెప్పారు. ప్రస్తుత ఫలితాలను ఇరుపక్షాలూ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సరిహద్దు నిర్వహణ, నియంత్రణను మరింత మెరుగు పరచాల్సిన అవసరముందన్నారు.

అప్పట్లో భారత్ మూడు పరస్పర సహకార సూత్రాలను ప్రతిపాదించిందని గుర్తు చేశారు. పరస్పర గౌరవం, పరస్సర ప్రయోజనాలు, పరస్పర సున్నితాంశాలకు రెండు దేశాలూ కట్టుబడాలన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడాలని, సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు చర్చల కోసం ఓ ‘హాట్ లైన్’ను ఏర్పాటు చేసుకుందామని చెప్పారు.