India: నష్టాలలో ట్రేడ్ అవుతున్న మార్కెట్లు.. సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్ల డౌన్!

  • లాభాల స్వీకరణకు దిగిన ఇన్వెస్టర్లు
  • ఒకటిన్నర శాతం నష్టంలో సూచీలు
  • మరింత కరెక్షన్ వచ్చే అవకాశం
Stock Market Huge Loss in Early Trade

భారత స్టాక్ మార్కెట్ ఈ ఉదయం భారీగా నష్టపోయింది. ఇటీవలి కాలంలో ఆల్ టైమ్ రికార్డుల దిశగా సెన్సెక్స్ సాగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ లోనూ ఒడిదుడుకులు కొనసాగుతూ ఉండటంతో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక దాదాపు 1000 పాయింట్లు పడిపోయింది. ఈ ఉదయం 10.20 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 923 పాయింట్ల నష్టంతో ఉన్న సెన్సెక్స్ 50,115 పాయింట్ల వద్ద కదలాడుతోంది.

ఇక ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 253 పాయింట్లు పడిపోయి 14,843 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. బెంచ్ మార్క్ సూచికలు ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోవడం గమనార్హం. పెట్టుబడిదారుల సెంటిమెంట్ అమ్మకాల దిశగానే సాగుతోందని, మార్కెట్లో మరికొంత కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 30లోని ఎనిమిది కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, మారుతి సుజుకి, భారతీ ఎయిర్ టెల్, అల్ట్రా సిమెంట్స్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే ఇండియా కంపెనీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 4 శాతానికి పైగా నష్టంలో కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, రిలయన్స్, ఎస్బీఐ వంటి దిగ్గజ సంస్థలు ఒకటి నుంచి రెండు శాతం నష్టంలో ఉన్నాయి.

More Telugu News