Hyderabad: భాగ్యనగరిలో మారిపోతున్న పార్కింగ్ రూల్స్... కొత్త నిబంధనలు ఇవి!

  • మళ్లీ పెరిగిపోయిన పార్కింగ్ దందా
  • గత నాలుగు నెలలుగా ఫిర్యాదుల వెల్లువ
  • కొత్త రూల్స్ జారీ చేసిన జీహెచ్ఎంసీ
GHMC New Rules for Parking

హైదరాబాద్ నగరంలో అడ్డగోలుగా పెరిగిపోయిన వాహనాల పార్కింగ్ దందాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరోమారు చర్యలకు ఉపక్రమించింది. ఎటువంటి పార్కింగ్ ఫీజులను వసూలు చేయరాదని మూడేళ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్ సర్కారు, తొలి రోజుల్లో పక్కాగానే అమలు చేసినా, క్రమంగా అదే దందా తిరిగి ప్రారంభమైంది.

ఇటీవల కరోనా మహమ్మారి కట్టడి నిమిత్తం అమలు చేసిన లాక్ డౌన్ కూడా పార్కింగ్ దందా తిరిగి వేళ్లూనుకునేందుకు సహకరించింది. గడచిన నాలుగైదు నెలలుగా పార్కింగ్ ఫిర్యాదులు పెరగడంతో బల్దియా పరిధిలోని ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఈవీడీఎం) విభాగం చర్యలు ప్రారంభించింది.

వాహనాల పార్కింగ్ నిబంధనలను వెలువరిస్తూ, అధిక ఫీజు వసూలు చేస్తే, ఆ ఆధారాన్ని ఫోటో తీసి ఆన్ లైన్ లో ఈవీడీఎం ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ కు పంపాలని అధికారులు సూచించారు. ఇక నగరంలోని మాల్స్, మల్టీ ప్లెక్స్ లు, వాణిజ్య సంస్థలు, సినిమా హాల్స్ కు నేటి నుంచి పార్కింగ్ నిబంధనలతో కూడిన నోటీసులను అధికారులు పంపనున్నారు.

తాజా నిబంధనల ప్రకారం, ఎక్కడైనా, ఎప్పుడైనా 30 నిమిషాల వరకు ఎలాంటి పార్కింగ్‌ ఫీజు వసూలు చేసేందుకు వీల్లేదు. ఆపై గంట వ్యవధిలో మాల్, వాణిజ్య ప్రదేశంలో ఏమైనా షాపింగ్ చేసినట్టు బిల్లు చూపించినా పార్కింగ్ చార్జీ ఉండదు. బిల్లు లేకుంటే మాత్రం నిర్ణీత పార్కింగ్‌ ఫీజు చెల్లించాల్సి వుంటుంది. ఇక గంటకన్నా ఎక్కువ సమయాన్ని పార్కింగ్ లో ఉంచిన వారు మూవీ టిక్కెట్ ‌ను చూపించాలి. ఈ ధర పార్కింగ్‌ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు. ఒకవేళ నిర్ణీత పార్కింగ్‌ ఫీజు కంటే తక్కువగా ఉంటే మాత్రం ఫీజును చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు.

ఇక అన్ని వాణిజ్య సంస్థలు నిర్ణీత నమూనాలో పార్కింగ్‌ టిక్కెట్లను ముద్రించాలని, వాటిపై పార్కింగ్‌ నిర్వహిస్తున్న ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్‌ నెంబర్‌ తప్పనిసరని అధికారులు తేల్చి చెప్పారు. పార్కింగ్‌ ఫీజు చెల్లించనవసరం లేని వారికి సైతం పార్కింగ్‌ టిక్కెట్‌ ఇవ్వాల్సిందేనని, అయితే దానిపై ఫీజు వసూలు చేస్తే 'పెయిడ్' అని, వసూలు చేయకుంటే 'ఎగ్జెంప్టెడ్' అన్న స్టాంపు తప్పనిసరని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఈవీడీఎం నుంచి నోటీసు అందుకున్న 15 రోజుల్లోగా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని, లేకుంటే రూ. 50 వేల జరిమానా కట్టాల్సి వుంటుందని అధికారులు హెచ్చరించారు.

More Telugu News