కేజ్రీవాల్ కు భద్రత కుదింపు... అటువంటిది లేదన్న హోమ్ శాఖ!

26-02-2021 Fri 09:28
  • నేడు సూరత్ లో కేజ్రీవాల్ భారీ ర్యాలీ
  • ఆరుగురు కమాండోలను రెండుకు తగ్గించారన్న ఆప్
  • సాధారణ మార్పులో భాగమేనన్న హోమ్ శాఖ
  • భద్రత తగ్గించలేదని స్పష్టీకరణ
Home ministry Responds on Kejriwal Security Cut

తమ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భద్రతను కుదించారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఆరోపిస్తుండగా, కేంద్ర హోమ్ శాఖ మాత్రం ఆ ఆరోపణలను కొట్టేసింది. గుజరాత్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో, ముఖ్యంగా సూరత్ లో ఆప్ చెప్పుకోతగ్గ స్థానాలను గెలుపొందిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నేడు కేజ్రీవాల్ ప్రత్యేకంగా సూరత్ లో పర్యటించి, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలని భావించారు. ఇందుకోసం ప్రత్యేక ర్యాలీని సైతం ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ ర్యాలీకి బందోబస్తుగా ఉండాల్సిన పోలీసుల సంఖ్యను ప్రభుత్వం కుదించింది.

ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం నుంచి వచ్చిన సంకేతాలతోనే భద్రతను కుదించారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ కు భద్రతగా ఆరుగురు కమాండోలు ఉండాలని, కానీ ఆ సంఖ్యను రెండుకు తగ్గించారన్నది వారి ఆరోపణ. దీనిపై హోమ్ శాఖ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, తామేమీ భద్రతను తగ్గించలేదని, సాధారణ మార్పుల్లో భాగంగా నలుగురు కమాండోలను మార్చామని, ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతూనే ఉందని అన్నారు.