ధోనీ రికార్డును చెరిపేసిన విరాట్ కోహ్లీ!

26-02-2021 Fri 07:11
  • స్వదేశంలో అత్యధిక మ్యాచ్ లలో విజయం
  • 21 విజయాలతో కెరీర్ ను ముగించిన ధోనీ
  • 22 విజయాలు సాధించిన విరాట్ కోహ్లీ
Dhoni Record is now with Kolhi

కేవలం రెండు రోజుల్లోనే ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ ముగియగా, ఈ చిరస్మరణీయ విజయంతో స్వదేశంలో అత్యధిక టెస్ట్ మ్యాచ్ లను గెలిచిన కెప్టెన్ గా ఇప్పటివరకూ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ చెరిపేశాడు.

 ఇండియాలో జరిగిన మొత్తం 30 టెస్ట్ మ్యాచ్ లకు సారధ్యం వహించిన ధోనీ, వాటిల్లో 21 విజయాలను నమోదు చేయగా, 29 టెస్ట్ లకు నాయకత్వం వహించిన కోహ్లీ, నిన్నటి విజయంతో 22 మ్యాచ్ లలో గెలుపును అందించాడు. మొత్తం మీద టెస్ట్ కెప్టెన్ గా 35 విజయాలను సాధించి, అత్యధిక సక్సెస్ రేటు ఉన్న కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. ఈ సీరీస్ లో ప్రస్తుతం భారత్ 2-1 లీడ్ లో ఉందన్న సంగతి తెలిసిందే.

ఇక మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ఇదో ఆశ్చర్యకరమైన మ్యాచ్ అని వ్యాఖ్యానించాడు. రెండు రోజుల్లోనే ఆట పూర్తవుతుందని భావించలేదని, మెరుగైన స్పిన్నర్లను కలిగి వుండటమే భారత్ కు బలంగా మారిందని అన్నాడు. కాగా, మ్యాచ్ రెండో రోజున మొత్తం 17 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్ లో ఓటమితో టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలను ఇంగ్లండ్ చేజార్చుకుంది.

మళ్లీ వచ్చే నెల 4 నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనున్న నాలుగో మ్యాచ్ లో ఇండియా గెలిస్తే టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుని న్యూజిలాండ్ తో తలపడుతుంది. కనీసం డ్రా చేసుకున్నా ఫైనల్ కు వెళుతుంది. ఒకవేళ ఇండియా ఓడిపోయి, ఇంగ్లండ్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియాకు ఫైనల్ చేరుకునే అవకాశాలుంటాయి.