లేడీ గాగా కు చెందిన పెంపుడు శునకాల దొంగతనం!

26-02-2021 Fri 06:58
  • వాకింగ్ కు తీసుకెళ్లిన సమయంలో ఘటన
  • సంరక్షకుడిపై కాల్పులు జరిపిన వ్యక్తులు
  • భారీ పారితోషికాన్ని ప్రకటించిన లేడీ గాగా
Lady Gagas Frence Bulldogs Stolen

ప్రఖ్యాత పాప్ గాయని లేడీ గాగాకు చెందిన రెండు పెంపుడు శునకాలను దుండగులు అపహరించారు. కుక్కల సంరక్షకుడిని తుపాకితో కాల్చిన దుండగులు, ప్రేమగా పెంచుకుంటున్న రెండు బుల్ డాగ్స్ ను ఎత్తుకెళ్లిపోయారని లేడీ గాగా ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

 ప్రస్తుతం కుక్కల సంరక్షకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, బుధవారం రాత్రి ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఇవి ఫ్రెంచ్ బుల్ డాగ్స్ అని, వాటి పేర్లు కోజి, గుస్టావో అని ఆయన తెలిపారు. ఈ మేరకు లాస్ ఏంజిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.

మూడు శునకాలను వాటి సంరక్షకుడు వాకింగ్ కు తీసుకెళ్లాడని, రాత్రి 9.40 గంటల సమయంలో అతనిపై కాల్పులు జరిపారని, రెండు శునకాలను వారు దొంగిలించగా, మూడవ దాన్ని అదే ప్రాంతంలో కనుగొన్నామని వెల్లడించారు. మరోపక్క, ఈ శునకాల ఆచూకీ తెలిపితే 5 లక్షల డాలర్ల బహుమతిని ఇస్తానని లేడీ గాగా వెల్లడించడం గమనార్హం.