ఇండియా, పాక్ సైనికాధికారుల మధ్య అరుదైన ఫోన్ కాల్!

26-02-2021 Fri 06:52
  • సీమాంతర కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన 
  • అంతకుముందు హాట్ లైన్ లో చర్చలు
  • ఇరు దేశాలకూ మేలు కలిగించే నిర్ణయమన్న అధికారులు

ఇండియా, పాకిస్థాన్ దేశాలు సీమాంతర కాల్పుల విరమణ ఒప్పందాన్ని సంయుక్తంగా ప్రకటించకముందు ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఇరు దేశాల సైనికాధికారుల మధ్యా ఓ అరుదైన ఫోన్ కాల్ నడిచింది. ఈ కాల్ తరువాతే కాల్పులను విరమించాలని రెండు దేశాలూ నిర్ణయించాయని అధికార వర్గాలు తెలిపాయి. గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో ఇరువైపులా బలగాలు తరచూ ఫైరింగ్ ను ఓపెన్ చేస్తుండగా, ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని వున్న సంగతి తెలిసిందే.

2003లో ఓ మారు పాకిస్థాన్ నుంచి సీమాంతర కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రతిపాదన రాగా, భారత్ అంగీకరించింది. ఆ ఒప్పందం 2016 వరకూ అమలులో ఉండగా, యూరి ఉగ్రదాడి తరువాత 2018 వరకూ సరిహద్దులు తుపాకుల మోతతో మోగిపోయాయి. 2018లో పాకిస్థాన్ మరోమారు ఇదే తరహా ప్రతిపాదన చేయగా, భారత్ తిరస్కరించింది.

సరిహద్దుల్లో కాల్పులు కొనసాగుతున్నా, రెండు దేశాల సైనిక అధికారుల మధ్య ఉన్న హాట్ లైన్ మాత్రం పని చేస్తూనే ఉంది. నిత్యమూ మేజర్ ర్యాంక్ అధికారుల మధ్య మాటలు నడుస్తూనే ఉన్నాయి. వారంలో ఒకసారి బ్రిగేడియర్ స్థాయి అధికారులు మాట్లాడుకుంటుంటారు. అయితే, డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారుల మధ్య మాటలు మాత్రం అత్యంత అరుదని సైనిక వర్గాలు వెల్లడించాయి.

సోమవారం నాడు డైరెక్టర్ జనరల్ స్థాయిలోని అధికారులు మాట్లాడుకున్నారని, బుధవారం రాత్రి నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిందని, ఇది రెండు దేశాలకూ మేలు కలిగించే నిర్ణయమని అధికారులు తెలిపారు.