Ganta Srinivasa Rao: స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం మారదని మోదీ సంకేతాలు ఇచ్చారు... ఏపీ బీజేపీ నేతలు దీనికేం సమాధానం చెబుతారు?: గంటా

  • ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా
  • ఇతర పార్టీల నేతలూ రాజీనామా చేయాలి 
  • ఏకతాటిపై నిలిచిపోరాడుదామని పిలుపు
Ganta comments on AP BJP leaders over steel plant issue

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తనతో పాటు ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేయాలని గంటా కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై తమ నిర్ణయం మారదని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలు ఇచ్చారని, దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు.

"పీఎం మోదీ గారేమో అన్నీ అమ్మేస్తాం అంటున్నారు. అబ్బే, అలాంటిదేమీ లేదని ఏపీ బీజేపీ నేతలు ఆంధ్రులను మభ్యపెడుతున్నారు. నిన్న ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన ఓ వెబినార్ లో... ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విధంగా ప్రధాని మాట్లాడారు. ప్రైవేటీకరణపై నోటిఫికేషనే రాలేదు, మీరు ఎలా ఉద్యమాలు చేస్తారు? అంటూ కాలయాపన మాటలు చెబుతున్న ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు మాట్లాడాలి. ఏపీ బీజేపీ నేతలు వెంటనే కార్యాచరణ ప్రకటించాలి" అని గంటా డిమాండ్ చేశారు.

బీజేపీ నేతలు ఇప్పటికైనా మేల్కొనాలని, పదవుల కోసం కాకుండా ప్రాంతం (విశాఖ ఉక్కు కర్మాగారం) కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. 'రండి, ఏకతాటిపై నిలిచి మన విశాఖ ఉక్కును కాపాడుకుందాం' అని పేర్కొన్నారు.

More Telugu News