'మోసగాళ్లు' ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి... కృతజ్ఞతలు తెలిపిన మంచు విష్ణు

25-02-2021 Thu 18:25
  • మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో 'మోసగాళ్లు'
  • ట్విట్టర్ లో ట్రైలర్ లింకు పంచుకున్న చిరంజీవి
  • ఓ వాస్తవ గాథ ఆధారంగా తెరకెక్కిందని వెల్లడి
  • భారీ ఐటీ స్కాం ఈ చిత్ర ఇతివృత్తమని వివరణ
Chiranjeevi releases Mosagallu trailer

ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం 'మోసగాళ్లు'. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ జీ చిన్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో మంచు విష్ణు హీరో కాగా, ఆయన సోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ఓ వాస్తవిక గాథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మోసగాళ్లు' అని వెల్లడించారు. అమెరికాను కుదిపేసిన అత్యంత భారీ ఐటీ స్కాంను ఈ చిత్రంలో చూడొచ్చని తెలిపారు. మంచు విష్ణుతో పాటు ఈ చిత్రయూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో 'మోసగాళ్లు' ట్రైలర్ యూట్యూబ్ లింకును పంచుకున్నారు.

కాగా, 'మోసగాళ్లు' చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసినందుకు చిరంజీవికి మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ట్రైలర్ విడుదల చేయడమే కాకుండా మా అందరిపై మీ ప్రేమాభిమానాలు చూపినందుకు "థాంక్యూ అంకుల్" అంటూ వినమ్రంగా బదులిచ్చారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే... మంచు విష్ణు డబ్బు, పేదరికం గురించి చెప్పే డైలాగుతో ఆరంభమవుతుంది. లక్ష్మీదేవి ఎందుకంత రిచ్ అయ్యిందో తెలుసా అంటూ కాజల్ చెప్పే డైలాగు ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ఈ సినిమా మొత్తం మనీ చుట్టూనే తిరుగుతుందన్న అంశం ట్రైలర్ చెబుతోంది.