గుంటూరు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

25-02-2021 Thu 17:53
  • గుంటూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర
  • పార్టీ నేతలతో ఈరోజు భేటీ అయిన అచ్చెన్నాయుడు
  • మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదలతో టీడీపీ
TDP finalises Kovelamudi Ravindra as Guntur Mayor candidate

ఏపీలో పంచాయతీ ఎన్నికల పంచాయితీ ముగిసింది. ఇప్పుడు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో, గుంటూరు నగర మేయర్ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర పేరును ఖరారు చేశారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల వివరాలపై పార్టీ నేతలతో చర్చించారు. వాస్తవానికి కోవెలమూడి రవీంద్ర పేరును పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఖరారు చేసింది. ఈరోజు నేతలతో కూడా చర్చించిన తర్వాత ఆయను పేరును అధికారికంగా ప్రకటించారు.

పంచాయతీ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చవిచూసిన టీడీపీ... మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. దీనికి అనుగుణంగా గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని యోచిస్తోంది. ఇక కోవెలమూడి విషయానికి వస్తే... కరోనా సమయంలో అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆయన దగ్గరయ్యారని పార్టీ కేడర్ చెబుతోంది. తాజాగా ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువయ్యే పనిలో ఆయన ఉన్నారని చెపుతున్నారు.