స్వామీజీల గురించి చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరం: సజ్జల

25-02-2021 Thu 17:33
  • ఇటీవల విశాఖలో స్వరూపానందను కలిసిన సీఎం జగన్
  • టీడీపీ నేతల విమర్శలు
  • గతంలో చంద్రబాబు కూడా కలిశాడన్న సజ్జల
  • అప్పుడే క్షుద్రపూజల కోసం కలిశారంటూ నిలదీసిన వైనం
Sajjala comments on Chandrababu

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. స్వామీజీల గురించి చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా స్వరూపానందస్వామిని కలిశారని, ఆయనతో పాటు అనేకమంది టీడీపీ నేతలు కలిశారని వెల్లడించారు. మరి, ఆనాడు చంద్రబాబు ఏ క్షుద్రపూజల కోసం స్వరూపానందను కలిశారో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబుది మొదటి నుంచి ద్వంద్వ వైఖరి అని విమర్శించారు.

విధానపరమైన విమర్శలు చేస్తే ఎవరూ అభ్యంతరపెట్టరని, కానీ స్వామీజీల నేపథ్యంలో చంద్రబాబు మాటలు అసంబద్ధమైనవని సజ్జల పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో ఆయన తీవ్ర అసహనానికి గురవుతున్నట్టు తన మాటల ద్వారా అర్థమవుతోందని అన్నారు. ఇటీవల సీఎం జగన్ విశాఖ శారదాపీఠంలో స్వరూపానందను కలవడంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.