శ్రీదేవి తర్వాత ఆ స్థాయిలో నేనే నటించాను: కంగన రనౌత్

25-02-2021 Thu 16:48
  • 10 ఏళ్లు పూర్తి  చేసుకున్న 'తను వెడ్స్ మను'
  • కంగన కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం
  • శ్రీదేవి తర్వాత అంతటి కామెడీ తానే చేశానన్న కంగన
Kangana Ranaut compares her with Sridevi

ఇటీవలి కాలంలో మన దేశంలో మారుమోగుతున్న పేర్లలో బాలీవుడ్ నటి కంగాన రనౌత్ ఒకరు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే పరిశ్రమలో అడుగుపెట్టి, అగ్రనటీమణుల సరసన చేరుకున్న కంగన... వ్యక్తిగతంగా ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకుంది.

ఒక నటిగానే కాకుండా దర్శకత్వంలో సైతం తన ప్రతిభను నిరూపించుకుంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుట్ మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో, సాక్షాత్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కూడా ఆమె ఢీకొంది. ఇవన్నీ పక్కన పెడితే... తాజాగా కంగన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ నటి శ్రీదేవి తర్వాత ఆమె స్థాయిలో కామెడీ పాత్రల్లో కూడా నటించగల సామర్థ్యం తనకు మాత్రమే సొంతమని  కంగనా తెలిపింది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన 'తను వెడ్స్ మను' ఈ  ఏడాదితో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అప్పటి వరకు ఒకే రకమైన పాత్రలను పోషించిన తన కెరీర్ ను ఈ చిత్రం మార్చి వేసిందని చెప్పింది. ఈ చిత్రంలో ఒక విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నానని తెలిపింది. శ్రీదేవి తర్వాత ఆ స్థాయిలో కామెడీని పోషించింది తానేనని చెప్పింది.