China: పేదరికాన్ని గెలిచాం.. మానవ అద్భుతాన్ని సృష్టించాం: చైనా

  • మరేదేశమూ పేదరికాన్ని అంతం చేయలేదన్న జిన్ పింగ్
  • ఈ మానవ అద్భుతం చరిత్రలో నిలిచిపోతుందని కామెంట్
  • అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయం చేసే స్థాయికి ఎదిగామని వెల్లడి
  • జిన్ పింగ్ వ్యాఖ్యలపై విమర్శలు.. లెక్కల్లో గోల్ మాల్ చేశారన్న ఆరోపణలు
Xi Jinping Declares China Created Human Miracle Of Eliminating Extreme Poverty

కడు పేదరికాన్ని గెలిచేశామని, మానవ అద్భుతాన్ని సృష్టించామని చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ ప్రకటించారు. గురువారం దేశ రాజధాని బీజింగ్ లో అట్టహాసంగా జరిగిన వేడుకల్లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అధికారులకు పతకాలను ప్రదానం చేశారు. అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలకు ఈ విషయంలో చైనానే స్ఫూర్తి అని అన్నారు.

ఇంత తక్కువ టైంలో కోట్లాది మందిని మరేదేశమూ పేదరికం నుంచి బయట పడేయలేదని జిన్ పింగ్ అన్నారు. చైనా సాధించిన ఈ మానవ అద్భుతం ఎన్నటికీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయం చేసే స్థాయికి చైనా చేరిందన్నారు. అయితే, ప్రభుత్వ లెక్కలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుకున్న లక్ష్యాన్ని చేరేందుకు లెక్కల్లో గోల్ మాల్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదరికం కోసం ఖర్చు చేయాల్సిన నిధుల్లో అక్రమాలు జరిగాయన్న విమర్శలూ ఉన్నాయి.

అయితే, 2020 నాటికి దేశంలో పేదరికాన్ని అంతం చేస్తామంటూ 2015లో మరోసారి అధికారంలోకి వచ్చిన జిన్ పింగ్ చెప్పారు. అప్పటి నుంచి కొన్ని వేల కోట్లు మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పన్ను ఇన్సెంటివ్ లు, సబ్సిడీలు ప్రకటించారు. తాజాగా, పేదరికాన్ని అంతం చేశామని ఆయన ప్రకటించారు. అయితే, 1970 నుంచి ఇప్పటిదాకా ఎన్నెన్నో సంస్కరణలు చేపట్టిన చైనా.. 80 కోట్ల మంది ప్రజలను కడు బీదరికం నుంచి బయటపడేసిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.

పేదరికాన్ని అంతం చేశామని చైనా చెబుతున్నా.. పేదరికానికి చైనా ప్రామాణికంగా తీసుకున్న రోజువారీ తలసరి ఆదాయ పరిమితి 2.3 డాలర్లు చాలా తక్కువ అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రస్తుతం ఉన్న పరిమితికి ఇది చాలా తక్కువేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రపంచ బ్యాంకు పెట్టిన పరిమితి 1.9 డాలర్ల కన్నా చైనా పరిమితి కొంచెం ఎక్కువే ఉంది.

More Telugu News