ఈ నెల 28న నింగిలోకి పీఎస్ఎల్వీ సి-51

25-02-2021 Thu 14:35
  • మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
  • శ్రీహరికోట నుంచి ప్రయోగం
  • పూర్తయిన లాంచ్ రిహార్సల్
  • ప్రారంభం కానున్న కౌంట్ డౌన్
  • 19 ఉపగ్రహాలను మోసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సి-51
ISRO set to launch PSLV rocket

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 28న పీఎస్ఎల్వీ సి-51 వాహకనౌక శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆదివారం ఉదయం 10.24 గంటలకు రాకెట్ ప్రయోగం నిర్వహిస్తారు. ఈ ప్రయోగానికి సంబంధించిన లాంచ్ రిహార్సల్ ప్రక్రియ ఇవాళ ముగిసింది. ఇక ప్రధాన ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రక్రియ షురూ చేస్తారు.

పీఎస్ఎల్వీ సి-51 రాకెట్ ద్వారా అమెజానియా-1తో పాటు మరో 18 ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెడతారు. కాగా, భారత స్టార్టప్ లకు చెందిన రెండు ఉపగ్రహాలను కూడా ఈ వాహకనౌక ద్వారా పంపాలని నిర్ణయించగా, వాటిలో పిక్సెల్ సంస్థ రూపొందించిన ఆనందన్ అనే ఉపగ్రహానికి సాఫ్ట్ వేర్ సమస్యలు తలెత్తాయి. దాంతో ఆ ఉపగ్రహాన్ని జాబితా నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.