భారత దేశవాళీ క్రికెట్లో పృథ్వీ షా సరికొత్త రికార్డు

25-02-2021 Thu 13:36
  • విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు
  • 152 బంతుల్లో 227 పరుగులు చేసిన షా
  • పుదుచ్చేరితో 50 ఓవర్ల మ్యాచ్
  • సంజు శాంసన్ రికార్డు తిరగరాసిన షా
Prithvi Shaw registered highest individual score in Vijay Hazare Trophy

యువ క్రికెటర్లలో అత్యంత ప్రతిభావంతుడిగా పేరుపొందిన ముంబయి ఆటగాడు పృథ్వీ షా భారత దేశవాళీ క్రికెట్లో సంచలన ఇన్నింగ్స్ తో అలరించాడు. విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు తిరగరాశాడు. జైపూర్ లో పుదుచ్చేరి జట్టుతో జరుగుతున్న 50 ఓవర్ల మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలో దిగిన పృథ్వీ షా 152 బంతుల్లో 227 పరుగులు సాధించాడు. షా సాధించిన అద్భుత డబుల్ సెంచరీలో 31 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

కాగా, విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ పేరిట ఉంది. 2019-20 సీజన్ లో శాంసన్ గోవాపై ఆడుతూ 212 పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డును పృథ్వీ షా బద్దలు కొట్టాడు. ఇటీవల కాలంలో పేలవ ఫామ్ తో సతమతమవుతూ టీమిండియాలో స్థానం కూడా కోల్పోయిన పృథ్వీ షా పుదుచ్చేరితో మ్యాచ్ లో తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. పృథ్వీ షా ప్రస్తుతం ముంబయి జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇక, ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ కూడా భారీ సెంచరీ నమోదు చేయడంతో ముంబయి జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 457 పరుగుల అతి భారీ స్కోరు నమోదు చేసింది.