Vishnu Vardhan Reddy: టీవీ చానల్ ఘటన నేపథ్యంలో చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

Vishnuvardhan Reddy alleges Chandrababu conspiracy continues
  • ఓ చానల్ స్టూడియోలో విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి
  • చంద్రబాబు కుట్ర అంటూ విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు
  • భౌతికదాడులతో తమను ఏమీ చేయలేరని ధీమా
  • చంద్రబాబు మూర్ఖంగా ఆలోచిస్తున్నారని విమర్శలు
  • ప్రజల తరఫున మరింత గట్టిగా ప్రశ్నిస్తానని ఉద్ఘాటన
ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాస్ చెప్పుతో దాడి చేయడం బీజేపీ శ్రేణులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. బీజేపీ నేతలు ఇప్పటికే సదరు చానల్ ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ చానల్ టీడీపీకి వత్తాసు పలుకుతోందంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

'అధికారం కోసం నాడు వైస్రాయ్ హోటల్లో తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ పై జరిపిన దుశ్చర్యకాండ నుంచి నిన్న ఏబీఎన్ చర్చా కార్యక్రమం వరకు మీ కుట్రకోణం కొనసాగుతూనే ఉంది' అంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. 'భౌతికదాడులతో బీజేపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తామనుకోవడం మీ మూర్ఖపు ఆలోచన' అని విమర్శించారు.

ప్రజల తరఫున ప్రశ్నించడంలో తాను వెనుకడుగు వేసేదే లేదని, ఇలాంటి దాడులకు బెదిరిపోయేది లేదని విష్ణువర్ధన్ రెడ్డి ఉద్ఘాటించారు. 'అణగారిన వర్గాలను అడ్డుపెట్టుకుని మీ నీచపు రాజకీయ సంస్కృతితో మా గొంతు నొక్కడం అసాధ్యం' అని స్పష్టం చేశారు. ఇకపైనా ప్రజా సమస్యలపై రెట్టింపు స్థాయిలో గళం వినిపిస్తానని వ్యాఖ్యానించారు.

"నాపైనా, మా పార్టీ పైనా మీ అనుకూల సామాజిక మాధ్యమాల ద్వారా చేసే తప్పుడు ప్రచారం ఇకనైనా మానుకుంటే మంచిది. నిన్నటి ఘటనలో నాకు వెన్నంటి నిలిచి, పూర్తి మద్దతు పలికిన నా పార్టీ కార్యకర్తలు, పార్టీ పెద్దలు, ఇతర పార్టీల నేతలు, పాత్రికేయ సోదరులు, ప్రజాసంఘాలు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.
Vishnu Vardhan Reddy
Chandrababu
NTR
BJP
Telugudesam
Andhra Pradesh

More Telugu News