భారత్​ తో కశ్మీరే మా సమస్య: ఇమ్రాన్ ఖాన్​

25-02-2021 Thu 13:03
  • చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్న పాక్ ప్రధాని
  • ప్రధాని నరేంద్ర మోదీతోనూ మాట్లాడినా ఫలితం లేదని వ్యాఖ్య
  • అయితే, ఆ బాధ్యత పాకిస్థాన్ దేనని తేల్చి చెప్పిన భారత విదేశాంగ శాఖ
  • తామూ మంచి సంబంధాలుండాలనే కోరుకుంటామని వెల్లడి
  • ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు చేపట్టినప్పుడే అది సాధ్యమని కామెంట్
Kashmir only dispute with India can be resolved through dialogue Pakistan PM Imran Khan in Sri Lanka

భారత్ – పాక్ మధ్య ఉన్న సమస్య కేవలం కశ్మీరేనని, భారత్ తో తమకున్న వివాదాలు దానిపైనేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. శ్రీలంక పర్యటనలో ఉన్న ఆయన.. శ్రీలంక–పాకిస్థాన్ వాణిజ్యం, పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సతో కలిసి సమావేశంలో మాట్లాడారు.

తాను అధికారంలోకి రాగానే భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడానని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పానని అన్నారు. అయితే, ఆ విషయంలో తాను విఫలమయ్యానని, ఎప్పటికైనా చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారానే ఉపఖండంలో పేదరికం అంతరిస్తుందన్నారు.

ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై మన విదేశాంగ శాఖ స్పందించింది. ఆ బాధ్యత పాకిస్థాన్ పైనే ఉందని తేల్చి చెప్పింది. ‘‘చర్చలపై మాది ఒకే ఒక్క మాట. పాక్ తో మంచి సంబంధాలనే మేమూ కోరుకుంటాం. కానీ, ఉగ్రవాద నిర్మూలన, యుద్ధ వాతావరణం, హింస లేకుండా చూసినప్పుడే అది సాధ్యమవుతుంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు.