వచ్చే నెలలో సెట్స్ కు వెళ్లనున్న సమంత 'శాకుంతలం'

25-02-2021 Thu 12:42
  • గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం'
  • తొలిసారిగా పౌరాణిక పాత్రలో సమంత
  • మార్చ్ 20 నుంచి షూటింగ్ ప్రారంభం 
  • షూటింగ్ కోసం భారీ సెట్స్ నిర్మాణం  
Samanthas Shakuntalam to be started next month

ప్రస్తుతం ఇటు సినిమాలు.. అటు వెబ్ సీరీస్ లలో నటిస్తూ బిజీబిజీగా వున్న కథానాయిక సమంత తొలిసారిగా ఓ పౌరాణిక కథా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథను 'శాకుంతలం' పేరిట ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కావ్యనాయిక శకుంతల పాత్రను పోషించే అవకాశం సమంతకు దక్కింది.    

ఈ చిత్రానికి భారీ సెట్స్ అవసరం కావడంతో ప్రస్తుతం దర్శకుడు ఆ పనిని దగ్గరుండి పర్యవేక్షిస్తూ చేయిస్తున్నారు. మరోపక్క స్క్రిప్టు పనిని పూర్తిచేస్తూ.. ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం షూటింగును వచ్చే నెల 20 నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందులో మరో కీలక పాత్ర అయిన దుష్యంతుడుగా ఎవరు నటిస్తారన్నది త్వరలో ప్రకటిస్తారు. భారీ బడ్జెట్టుతో తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషలలోనూ దీనిని ఏకకాలంలో నిర్మిస్తున్నారు. కాగా, నటిగా సమంతకు ఇది ఛాలెంజ్ తో కూడిన పాత్ర. ఇన్నాళ్లూ ఆమె చేసిన పాత్రలు అన్నీ ఒకెత్తయితే, ఇది ఒక్కటీ ఒకెత్తని చెప్పచ్చు!