UN: హక్కుల మండలిలో పాక్​, టర్కీ, ఓఐసీ దేశాలకు భారత్​ ఘాటు సమాధానం!

India combinedly attacks on Pak Turkey OIC in UN HRC
  • ఉగ్రవాదులకు అడ్డాగా పాకిస్థాన్ మారిపోయిందని మండిపాటు
  • మైనారిటీలను అణచివేస్తూ హక్కులను కాలరాస్తోందని విమర్శలు 
  • కశ్మీర్ అంతర్గత వ్యవహారమని స్పష్టీకరణ 
  • చెడు కోసం వాడుకుంటున్నా పాక్ కు ఓఐసీ సహకరిస్తోందని ఆరోపణ

ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల మండలిలో పాకిస్థాన్ కు, ఆ దేశానికి మద్దతునిస్తూ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న మరికొన్ని దేశాలకూ భారత్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. హక్కుల మండలి 46వ సర్వసభ్య సమావేశాల సందర్భంగా ‘సమాధానం చెప్పే హక్కు (రైట్ ఆఫ్ రిప్లై)’ని వాడుకున్న భారత్.. పాకిస్థాన్, టర్కీ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో–ఆపరేషన్ (ఓఐసీ) దేశాల విమర్శలకు జవాబు చెప్పి.. వాటి నోర్లు మూయించింది. భారత్ తరపున యువ దౌత్యవేత్త, ఐరాసలో సెకండ్ సెక్రటరీ అయిన సీమా పుజానీ ఆయా దేశాలకు తగిన సమాధానం చెప్పారు.

కశ్మీర్ లో అక్రమ ప్రాజెక్టులు: పాక్ ఆరోపణ

కరోనా మహమ్మారిని అడ్డుపెట్టుకుని కశ్మీర్ లో భారత్ అనేక ప్రాజెక్టులు చేపడుతోందని, ఆర్టికల్ 370 రద్దు అయిన 2019 ఆగస్టు 5 తర్వాత అది మరింత పెరిగిందని పాకిస్థాన్ మానవ హక్కుల మంత్రి షిరీన్ మఝారీ ఆరోపించారు. ఆ ఆరోపణలకు దీటైన జవాబిచ్చారు సీమా పుజానీ.

ఉగ్రవాదుల అడ్డా పాక్: ఇండియా

జమ్మూ కశ్మీర్, లడఖ్ లు భారత్ కు చెందిన కేంద్ర పాలిత ప్రాంతాలని, అక్కడ జరిగే ప్రతి విషయమూ తమ అంతర్గత వ్యవహారమని సీమ స్పష్టం చేశారు. ఆయా చోట్ల సుపరిపాలన, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. హింసకు, వ్యవస్థీకృత వివక్షకు, మైనారిటీలపై అణచివేతకు పాకిస్థాన్ కేంద్రంగా మారిందని మండిపడ్డారు. మైనారిటీలకు చెందిన ప్రార్థనా మందిరాలపై అక్కడ తరచూ దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు.

ఉగ్రవాదులకు పాకిస్థాన్ అడ్డాగా మారిందని సీమ మండిపడ్డారు. ఎందరో నిషేధిత ఉగ్రవాదులకు ఆ దేశం ఆశ్రయమిస్తోందన్నారు. 126 మంది ఉగ్రవాదులు, 24 ఉగ్రవాద సంస్థలను ఐరాస భద్రతా మండలి నిషేధించిందని, కానీ, వాటికి పాకిస్థాన్ మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. అదే ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిందన్నారు. అమెరికా జర్నలిస్ట్ ను హత్య చేసిన అల్ ఖాయిదా ఉగ్రవాది ఒమర్ సయీద్ షేక్ ను ఇటీవలే పాకిస్థాన్ సుప్రీం కోర్టు నిర్దోషిగా విడుదల చేసిందని, ఉగ్రవాదులను ఆ దేశం ప్రోత్సహిస్తోందని చెప్పేందుకు ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకేం ఉంటుందని  అన్నారు.

ముందు మీ దేశం సంగతి చూస్కోండి.. టర్కీకి ఘాటు రిప్లై

కశ్మీర్ పై వ్యాఖ్యలు చేసిన టర్కీకీ ఘాటుగానే బదులిచ్చారు సీమ. సైప్రస్ పై భద్రతా మండలి తీర్మానాన్ని గుర్తు చేశారు. ఎదుటి దేశాలపై బురద జల్లే ముందు తమ దేశం సంగతేంటో చూసుకుంటే బాగుంటుందని చురకలంటించారు. కశ్మీర్ తమ సొంత వ్యవహారమని, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు చెప్పారు.

సొంత ప్రజలనే అణచివేస్తున్న టర్కీ.. భారత్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. సైప్రస్ మీద తీర్మానం చేసినా టర్కీ ఆక్రమణలు చేస్తూనే ఉందని గుర్తుచేశారు. ఓఐసీ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయన్నారు. ఓఐసీని చెడు కోసం వాడుకుంటున్న పాకిస్థాన్ కు ఆయా దేశాలు సహకరించడం విచారకరమన్నారు.

  • Loading...

More Telugu News