కరోనా విజృంభిస్తున్న 10 రాష్ట్రాలకు ప్రత్యేక కేంద్ర బృందాలు!

25-02-2021 Thu 09:54
  • పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు
  • క్షేత్ర స్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాలు
  • నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు
Central Teams for 10 States

దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసులు పెరుగుతున్న తీరును పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకునే దిశగా సిఫార్సులు చేసేందుకు 10 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది. ఈ బృందాలు మహారాష్ట్ర, కేరళ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్ము కాశ్మీర్ లో పర్యటించనున్నాయి. ఈ రాష్ట్రాల్లోనే కేసులు ఎందుకు ఒక్కసారిగా పెరుగుతున్నాయన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడమే లక్ష్యంగా టీమ్ లను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఆయా రాష్ట్రాల్లోని ప్రజారోగ్య శాఖ, జిల్లా, మండల స్థాయి అధికారుల సహకారంతో పాటు కొవిడ్ రెస్పాన్స్, మేనేజ్ మెంట్ టీమ్ లతో చర్చించి ఈ టీమ్ లు తమ నివేదికను సమర్పిస్తాయని, దాని ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని కేంద్ర ఉన్నతాధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారిపై ఇప్పటివరకూ జరిపిన పోరాటం వృథా కాకుండా చూడటమే ఈ బృందాల విధని తెలిపారు. ఈ మేరకు కేంద్రం నుంచి వచ్చే అధికారులకు సహకరించాలని పది రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు.

ఈ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆర్టీ-పీసీఆర్ పరీక్షల వివరాల నుంచి ఎన్ని పరీక్షలు చేస్తే, ఎన్ని పాజిటివ్ లు వస్తున్నాయి? పాజిటివ్ రేషియో, కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల వివరాలు, అక్కడి కంటెయిన్ మెంట్ జోన్లు, తీసుకుంటున్న నియంత్రణా చర్యలన్నింటినీ అధికారులు సమీక్షిస్తారని తెలిపారు. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ యాంటీజెన్ పరీక్షలు తప్పనిసరని, ఈ పరీక్షల్లో నెగటివ్ వచ్చినా, జలుబు, జ్వరం వంటి లక్షణాలున్న వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరని ఆయన అన్నారు.