ఓ యువతి ప్రేమకథకు విషాద ముగింపు... షబ్నం అలీని ఉరితీస్తే ఇండియాలో నయా చరిత్రే!

25-02-2021 Thu 08:41
  • స్వతంత్ర భారతావనిలో ఉరికంబం ఎక్కనున్న తొలి మహిళ
  • క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి
  • ప్రియుడి కోసం దారుణంగా ఏడుగురిని చంపిన షబ్నం
New Indian History if Shabnam Ali Hanged

పబ్నం అలీ... ఈ పేరు ఇప్పుడు ఇండియాలో ట్రెండింగ్. స్వాతంత్ర్యానంతరం ఇండియాలో ఉరికంబం ఎక్కబోతున్న తొలి మహిళ. చరిత్రలో విషాదాంతమైన  ప్రేమకథలు మనకు ఎన్నో తెలుసు. కానీ, ఇంత కఠిన శిక్షను అనుభవించనున్నది మాత్రం ఈమెనే. తన ప్రియుడి కోసం, ప్రేమించిన వాడిని పెళ్లాడటం కోసం కుటుంబ సభ్యులను అందరినీ దారుణంగా హత్య చేసిందీ మహిళ. అదే ఇప్పుడు ఆమె కంఠానికి ఉరితాడుగా మారనుంది. ఓ లవ్ స్టోరీ మూర్ఖత్వం, కర్కశత్వం, నేరం, ఘోరం తదితరాలతో కూడా సమ్మిళితం అవుతాయని షబ్నం కథ ఓ పాఠాన్ని చెబుతుంది.

ఇంతకీ షబ్నం ఎవరు? ఆమె లవ్ స్టోరీ ఏంటి? అన్న వివరాలను తెలుసుకోవాలని అనుకుంటే దాదాపు 12 ఏళ్లు వెనక్కు వెళ్లాలి. ఉత్తరప్రదేశ్ లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన ముస్లిం యువతి ఆమె. ఎన్నో సినిమాల్లో మాదిరిగానే తనకు నచ్చిన యువకుడిని ప్రేమించింది. మామూలుగా అయితే, పెద్దలను వ్యతిరేకించి పెళ్లి చేసుకోవడం లేదా తన ప్రేమను పెద్దల కోసం త్యాగం చేయడమో చూస్తుంటాం. కానీ షబ్నమ్ మాత్రం తన ప్రేమను ఎలాగైనా గెలిపించుకోవాలని భావించింది. అందుకు ఎవరూ ఎంచుకోని మార్గంలో నడిచింది. అదే ఇప్పుడామెను ఉరికొయ్యకు దగ్గర చేసింది.

అది 2008, ఏప్రిల్ 15... నాడు యూపీలోని బావాంఖేరి గ్రామంలో ఏడు హత్యలు జరిగాయన్న వార్త దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. తొలుత హత్యలు ఎవరు చేశారో తెలియకపోయినా, పోలీసుల విచారణలో మొత్తం బయకు వచ్చింది. తన ప్రేమికుడిని వదులుకోలేక, మరోవైపు తల్లిదండ్రులను ఒప్పించలేక షబ్మం, తల్లిదండ్రులు సహా ఇంట్లోని మరో ఐదుగురిని దారుణంగా హత్య చేసింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులే, ఓ మహిళ ఇంత దారుణానికి ఒడిగట్టగలదా? అని ఆశ్చర్యపోయారు.

దీనికి ఓ కారణం ఉంది. షబ్నం రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసిన అమ్మాయి. భౌగోళిక శాస్త్రంలో ఎంఏ కూడా చేసింది. ఆమె తండ్రి టీచర్ గా పనిచేసేవారు. షబ్నం కూడా ఓ పాఠశాలలో టీచర్ గా పని చేసింది. చదువుకుంటూనే ఆమె టీచర్ గా విద్యార్థులకు పాఠాలు చెబుతుండటాన్ని చూసి గ్రామంలోని వారు ఎంతో పొగడేవారు. ఆమె భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేసి కుటుంబం పేరును నిలబెడుతుందని కూడా అనేవారు. కానీ... విధి మరోలా తలచింది. ఉన్నత విద్యావంతురాలైన ఆమె ప్రియుడి కోసం క్షణికావేశంలో ఇంత దారుణానికి ఒడి గట్టిందని పోలీసులు తేల్చారు. తన అన్నవారు లేకుంటేనే మనసైన వాడు దగ్గరవుతాడని మనస్ఫూర్తిగా నమ్మడమే ఆమె చేసిన తప్పైంది.

ఆపై కేసు కోర్టుకు వచ్చింది. తొలుత సెషన్స్ కోర్టు, ఆపై హైకోర్టు, దాని తరువాత సుప్రీంకోర్టు షబ్నం చేసిన దారుణాతి దారుణాన్ని ఏ మాత్రమూ క్షమించలేమని తేల్చి చెప్పాయి. చిట్ట చివరిగా ఉన్న రాష్ట్రపతి క్షమాభిక్ష అవకాశం కూడా మూసుకుపోయింది. ఫలితంగా షబ్నం‌ అలీ ప్రియుడితో కలసి ఉరికంబం ఎక్కబోతోంది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉరిశిక్ష అమలు కాబోతున్న మొట్ట మొదటి మహిళ ఈమే కాగా, ఆమెను ఉరితీస్తే మాత్రం అది నయా చరిత్రే.

ఇప్పుడామెకు 39 ఏళ్లు. 2010లోనే ఉరి శిక్ష పడగా, ప్రస్తుతం యూపీలోని మధురై జైలులో ఆమె ఉంది. ఆమెను ఉరి తీసేందుకు అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. అయితే, ఆమెకు ఇంకా అవకాశాలు మూసుకుపోలేదు. రివ్యూ పిటిషన్ దాఖలుకు అవకాశం ఉంది. ఉరికి ఇంకా తేదీ కూడా ఖరారు కాలేదు. దీంతో ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు ఆమె తరఫు లాయర్లు పోరాడుతున్నారు.