ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువతి పొరపాటు... కుమారుడు, సోదరి మృతి!

25-02-2021 Thu 07:50
  • ఐస్ క్రీమ్ లో ఎలుకల మందు కలిపిన యువతి
  • కాస్త మిగల్చడంతో దాన్ని తిన్న కుమారుడు, సోదరి
  • వారిద్దరూ మృతి... కుట్ర కోణంపై పోలీసుల విచారణ

ఓ యువతి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఎలుకలను నిర్మూలించే మందును కొనుక్కుని వచ్చి, ఐస్ క్రీమ్ లో కలిపింది. అయితే, ఆమె చేసిన పొరపాటు కన్న బిడ్డను, తోడబుట్టిన చెల్లిని చంపేయగా, ఆమె మాత్రం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, తిరువనంతపురం సమీపంలో ఉంటున్న ఓ మహిళ, ఐస్ క్రీమ్ లో ఎలుకల మందు కలుపుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

అయితే, మొత్తం ఐస్ క్రీమ్ ను ఆమె తినలేక, అక్కడే వదిలేసింది. ఆ మిగిలిన ఐస్ క్రీమ్ కనిపించే సరికి దానిలో విషం ఉందని తెలియని ఆమె కుమారుడు, 19 ఏళ్ల చెల్లెలు దాన్ని లాగించేశారు. విష ప్రభావంతో వారిద్దరూ కన్నుమూయగా, ఆ మహిళ మాత్రం ప్రాణాలు నిలుపుకుంది. ఈ కేసు ఆత్మహత్య కోణమా? లేక దీని వెనుక మరేదైనా కుట్ర దాగుందా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.